ఐపీఎల్-2026 టోర్నీ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో గిల్ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంపై టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ముఖ్యంగా పేసర్ మహ్మద్ సిరాజ్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ నాయకత్వ బృందాన్ని భజ్జీ తప్పుబట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన గుజరాత్ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
రెండు ఓవర్లు వేసి
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత కీలక పేసర్లలో ఒకడైన గుజరాత్ బౌలర్ సిరాజ్ రెండు ఓవర్లు వేసి పదిహేను పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కొత్త బంతితో రంగంలోకి దిగిన అతడు.. ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు రాలేదు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్భజన్ సింగ్ టైటాన్స్ యాజమాన్య వైఖరిని విమర్శించాడు. ‘‘ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ ఎక్కువగా బౌలింగ్ చేయనేలేదు. ఇలా ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు.
సిరాజ్ జట్టులో ఎందుకున్నట్లు?
అతడితో కేవలం రెండు ఓవర్లే వేయించారు. నిజానికి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించాల్సింది. గాయం కారణంగానా? లేదంటే మరే ఇతర కారణాల వల్ల అతడిని పక్కనపెట్టారో తెలియదు. ఏదేమైనా అతడు మరో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అయితే, పంజాబ్ బ్యాటర్ కూపర్ కన్నోలి మెరుపు ఇన్నింగ్స్ (44 బంతుల్లో 72 నాటౌట్)తో జట్టును విజయతీరాలకు చేర్చడంతో గుజరాత్‌కు పరాభవం తప్పలేదు.


