పాపం సాయి సుద‌ర్శ‌న్‌.. ఐపీఎల్‌ చరిత్రలో వింత ఔట్‌! | GT Batter Sai Sudharsan Unlucky Dismissal Unwanted Record-IPL 2026 | Sakshi
Sakshi News home page

పాపం సాయి సుద‌ర్శ‌న్‌.. ఐపీఎల్‌ చరిత్రలో వింత ఔట్‌!

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 11:11 AM

GT Batter Sai Sudharsan Unlucky Dismissal Unwanted Record-IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆర్సీబీతో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ పోరులో గుజ‌రాత్ టైటాన్స్‌కు ఏదీ క‌లిసి రాలేదు. ఆర్సీబీ విధించిన 255 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని అందుకునే క్ర‌మంలో బ్యాటింగ్‌లో పూర్తిగా విఫ‌ల‌మైంది. అయితే గుజ‌రాత్ టైటాన్స్‌ ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ ఔటైన తీరు నిజంగా బాధాక‌ర‌మ‌ని చెప్పొచ్చు.  ఈ సీజన్ లో అత్యంత నిలకడగా పరుగులు చేస్తున్న సాయి సుదర్శన్.. ఆర్సీబీతో క్వాలిఫయర్-1 పోరులోనే వరుస బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించాడు. 

ఈ క్రమంలోనే ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో అద్భుతమైన స్క్వేర్ కట్‌తో బౌండరీ బాదాడు. వరుసగా రెండో ఫోర్ వచ్చిందని అభిమానులు అనుకుంటున్న త‌రుణంలోనే ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. షాట్ ఆడిన తర్వాత సాయి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. గాల్లో తిరుగిన బ్యాట్ వ‌చ్చి నేరుగా లెగ్ స్టంప్‌ను తాకి బెయిల్స్‌ను ప‌డ‌గొట్టింది. 

ఆర్సీబీ ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌డంతో అంపైర్ సాయి సుద‌ర్శ‌న్‌ను హిట్ వికెట్‌గా ఔటిచ్చాడు. దీంతో చేసేదేం లేక సాయి సుద‌ర్శ‌న్ నిరాశ‌గా పెవిలియ‌న్ చేరాడు. ఇలాంటి విచిత్ర‌మైన ఔట్ చూసి కామెంటేటర్లతో పాటు అభిమానులు కూడా షాక్ తిన్నారు. మ్యాచ్‌లో కూడా ఇదే ట‌ర్నింగ్ పాయింట్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ త‌ర‌ఫున నిల‌క‌డ‌గా రాణిస్తున్న సాయి సుద‌ర్శ‌న్ ఆరెంజ్‌క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. 

గతేడాది కుశాల్‌ మెండిస్‌..
ఇక ఐపీఎల్ చ‌రిత్ర‌లో ప్లేఆఫ్స్ ద‌శ‌లో హిట్ వికెట్ అయిన రెండో బ్యాట‌ర్‌గా సాయి సుద‌ర్శ‌న్ నిలిచాడు. తొలి బ్యాట‌ర్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గ‌తేడాది ముంబై ఇండియ‌న్స్‌తో ప్లేఆఫ్ మ్యాచ్ సంద‌ర్భంగా ఇదే గుజ‌రాత్‌కు చెంద‌ని కుశాల్ మెండిస్ హిట్ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ ఔట్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'బంతి బౌండరీకి వెళ్లింది.. కానీ బ్యాట్ వికెట్లను కొట్టేసింది', 'పాపం సాయి సుదర్శన్', 'క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఔట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌పై 92 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఓడినా గుజరాత్‌ ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌–2లో గుజరాత్‌ జట్టు తలపడుతుంది.   

చదవండి: గుజరాత్‌పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!

Advertisement
 
Advertisement
Advertisement