టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త ఇది. టెస్ట్‌లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు, వచ్చే ఏడాది (2027) మే వరకు 20 వన్డేలు ఆడే అవకాశం ఉంది. రో-కో ఎలాంటి విరామాలు తీసుకోకుండా ఆడితే ఇది జరుగుతుంది.
తాజాగా బీసీసీఐ రానున్న హోం సీజన్‌లో టీమిండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ఏకంగా 9 వన్డేలు ఉన్నాయి. మిగతా 11 వన్డేలకు భారత్ విదేశాల్లో ఆడనుంది. 2027 మే వరకు ఇంటా-బయటా టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.
ఐపీఎల్ తర్వాత జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకైక టెస్ట్ మరియు 3 వన్డేల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో జరిగే టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ధర్మశాల (జూన్ 14), లక్నో (జూన్ 17), చెన్నై (జూన్ 20) వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.
అనంతరం భారత్ జులైలో ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్ లీ స్ట్రీట్, ఓల్డ్ ట్రాఫర్డ్, ట్రెంట్ బ్రిడ్జ్, బ్రిస్టల్, సౌథాంప్టన్ వేదికలుగా జరుగనుండగా.. వన్డేలు జులై 14, 16, 19 తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్‌లో జరుగనున్నాయి.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు సహా 5 టీ20లు జరుగనున్నాయి. వన్డేలు సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3 తేదీల్లో తిరువనంతపురం, గౌహతి, ముల్లాన్‌పూర్ వేదికలుగా జరుగనుండగా.. టీ20లు అక్టోబర్ 6, 9, 11, 14, 17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్, డెహ్రాడూన్, బెంగళూరు నగరాల్లో జరుగనున్నాయి.
తర్వాత టీమిండియా ఆడబోయే వన్డేల వివరాలు..
టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో 5 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్‌పై స్పష్టత రావాల్సి ఉంది.
డిసెంబర్‌లో శ్రీలంక భారత్‌లో పర్యటించి 3 వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు డిసెంబర్ 13, 16, 19 తేదీల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి.
వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ మ్యాచ్‌లు జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి.


