పవర్‌ హిట్టర్‌.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే! | Sakshi
Sakshi News home page

అసాధారణ ఆటగాడు.. పవర్‌ హిట్టర్‌.. వన్డేల్లోనూ అరంగేట్రం చేయిస్తే!

Published Mon, Mar 11 2024 2:51 PM

Give Him ODI Debut As Well: Mohammad Kaif on Yashasvi Brilliance IND vs ENG - Sakshi

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు టీమిండియా యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌. టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ఓపెనర్‌గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో యశస్వి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

ఐదు మ్యాచ్‌లలో కలిపి (తొమ్మిది ఇన్నింగ్స్‌లో) ఏకంగా సగటు​ 89తో.. 712 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా రెండు డబుల్‌ సెంచరీలు ఉండటం విశేషం. ఈ క్రమంలో.. టీమిండియా 4-1తో సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌  ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు యశస్వి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌.. యశస్వి జైస్వాల్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘జైస్వాల్‌ను ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌లోనూ తన ఆట తీరును గమనిస్తూనే ఉన్నాం. అతడో అసాధారణ ఆటగాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలతో రాణించి టీ20లలోనూ అడుగుపెట్టాడు.

అయితే, ఇంతవరకు వన్డేల్లో మాత్రం అతడికి అవకాశం రాలేదు. 50 ఓవర్ల ఫార్మాట్‌ క్రికెట్‌లోనూ యశస్వితో అరంగేట్రం చేయిస్తే మంచిది. అప్పుడు అతడు.. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్ల ప్లేయర్‌గా జట్టుకు ఉపయోగపడతాడు. బ్యాటర్‌గా డిఫెన్సివ్‌గా.. అదే సమయంలో దూకుడుగా ఎలా ఉండాలో తెలిసిన ఆటగాడు.

ఆండర్సన్‌ బౌలింగ్‌లో మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన విధానం అతడి పవర్ హిట్టింగ్‌ నైపుణ్యాలకు నిదర్శనం’’ అని మహ్మద్‌ కైఫ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముంబై బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ 26 సిక్సర్లు బాదారు. ముఖ్యంగా రాజ్‌కోట్‌ టెస్టులో  ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్స్‌లు కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ముంబై బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ 2023లో వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా టెస్టు, అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. 

చదవండి: శార్దూల్‌ ఏమన్నాడో విన్నాను: డొమెస్టిక్‌ క్రికెట్‌పై ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement