
సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్న మీనాక్షి
పురుషుల విభాగంలో భారత్‌కు నిరాశ
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళా బాక్సర్లు నాలుగు పతకాలు ఖరారు చేసుకొని భారత్ పరువును నిలబెట్టారు. 57 కేజీల విభాగంలో జైస్మీన్ లంబోరియా, ప్లస్ 80 కేజీల విభాగంలో నుపుర్ షెరాన్ ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. 48 కేజీల విభాగంలో మీనాక్షి హుడా సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 80 కేజీల విభాగంలో ఇప్పటికే పూజా రాణి సెమీఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.
శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం సెమీఫైనల్లో జైస్మీన్ 5–0తో అల్కాలా కరోలినా (వెనిజులా) ఘనవిజయం సాధించింది. ఫైనల్లో జూలియా జెరెమిటా (పోలాండ్)తో జైస్మీన్ తలపడుతుంది. అల్కాలాతో జరిగిన బౌట్‌లో జైస్మీన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. మూడు రౌండ్లలోనూ భారత బాక్సరే పైచేయి సాధించింది. ప్లస్ 80 కేజీల విభాగం సెమీఫైనల్లో నుపుర్ 5–0తో సేమా దుజ్‌టాస్ (టర్కీ)పై గెలుపొందింది.
48 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మీనాక్షి 5–0తో అలైస్ పంఫేరి (ఇంగ్లండ్)పై నెగ్గింది. నేడు జరిగే సెమీఫైనల్లో లుట్‌సైఖాన్ (మంగోలియా)తో మీనాక్షి తలపడుతుంది. మరోవైపు పురుషుల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. 12 ఏళ్ల తర్వాత భారత పురుష బాక్సర్లు ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
బరిలో మిగిలిన చివరి బాక్సర్ జాదూమణి సింగ్ (50 కేజీలు) కూడా ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో జాదూమణి సింగ్ 0–4తో వరల్డ్ చాంపియన్ సంజార్ తషె్కన్‌బె (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు కాంస్యాలు లభించాయి.