
పట్నా పరాజయాల ‘హ్యాట్రిక్’
ప్రొ కబడ్డీ లీగ్
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 38–30తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. పీకేఎల్‌లో అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా పరాజయాల పరంపరలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. పైరేట్స్ ఆడిన మూడు ఓడగా... నాలుగో మ్యాచ్‌లో బుల్స్ తొలి విజయాన్ని సాధించింది. బెంగళూరు జట్టులో ఆల్‌రౌండర్ అలీరెజా మిర్జాయిన్ (10), రెయిడర్ ఆశిష్ మాలిక్ (8) అదరగొట్టారు.
డిఫెండర్లు దీపక్ శంకర్ (4), యోగేశ్ (3), సత్యప్ప, సంజయ్ చెరో 2 పాయింట్లు చేశారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్ అయాన్ (10) ఒంటరి పోరాటం చేశాడు. 15 సార్లు కూతకెళ్లిన అయాన్ పది పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతావారిలో సుధాకర్ (6), అంకిత్ కుమార్ (4) మెరుగ్గా ఆడారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయంట్స్ 37–28తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది.
గుజరాత్ జట్టులో ఆల్‌రౌండర్లు నితిన్ పన్వార్ (8), మొహమ్మద్ రెజా (6) రాణించారు. రెయిడర్లు రాకేశ్ 6, హిమాన్షు సింగ్ 4 పాయింట్లు సాధించారు. తలైవాస్ జట్టులో కెపె్టన్ పవన్ సెహ్రావత్ (6), నితీశ్ కుమార్ (5), అర్జున్ దేశ్వాల్ (5) ఆకట్టుకున్నారు. నేడు ఆదివారం జరిగే మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్, దబంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి.