ఇప్పటికైనా బాబర్‌ కెప్టెన్సీ వదిలేయాలి.. షాహిన్‌ను కెప్టెన్‌ చేయండి.. అప్పుడే!

Ex Pakistan Star: Babar Should Quit Captaincy Shaheen Be Captain - Sakshi

Babar Azam- Shaheen Afridi: ‘‘బాబర్ ఆజం ఇప్పటికైనా కెప్టెన్సీ వదిలేయాలి. ఒకవేళ తను సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగితే.. క్రికెట్‌లో దిగ్గజాలు సృష్టించిన రికార్డులన్నీ బద్దలు కొట్టడం కాయం. కెప్టెన్సీ భారం వల్ల తను పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడు’’ అని పాకిస్తాన్‌ మాజీ బ్యాటర్‌ బసిత్‌ అలీ అభిప్రాయపడ్డాడు. 

బాబర్‌ ఆజంకు ఐసీసీ పట్టం
పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ నిలకడైన ప్రదర్శనకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్‌లలో రాణించిన బాబర్‌ను ఐసీసీ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపిక చేసింది. 2022లో ఓవరాల్‌గా 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ 54.12 సగటుతో 2598 పరుగులు చేశాడు. 

ఇందులో 8 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దిగ్గజ క్రికెటర్‌ పేరిట ఏడాది ఉత్తమ ఆటగాడికి ఇచ్చే ‘సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ’ని బాబర్‌ అందుకుంటాడు. దీంతో పాటు బాబర్‌ ‘వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా కూడా ఎంపిక కావడం విశేషం.

ప్రశంసల జల్లు
వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న అతడు... గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు సాధించాడు. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో బసిత్‌ అలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సొంతగడ్డపై బాబర్‌ సారథ్యంలో ఇటీవల పలు సిరీస్‌లు ఓడిన వేళ.. కెప్టెన్సీ భారం నుంచి అతడికి విముక్తి కల్పించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. షాహిన్‌ ఆఫ్రిదిని పాక్‌ కెప్టెన్‌ను చేయాలని అలీ సూచించాడు. 

షాహిన్‌ను కెప్టెన్‌ చేయండి
ఈ మేరకు క్రికెట్‌ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. ‘‘బాబర్‌ బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి సారించాలి. ఇందుకు కెప్టెన్సీ అడ్డంకి కాకూడదు. తనకు రికార్డులన్నీ బద్దలు కొట్టగల ప్రతిభ ఉంది.  షాహిన్‌ ఆఫ్రిదిని పాక్‌ కెప్టెన్‌ను చేయాలి. టెస్టులు, వన్డేల పగ్గాలు అతడికి అప్పగించాలి.

షాబాద్‌ ఖాన్‌ను టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌ను చేయాలి’’ అని బసిత్‌ అలీ అభిప్రాయపడ్డాడు. అయితే, రషీద్‌ లతీఫ్‌ వంటి మరికొంత మంది ఐసీసీ అవార్డుల్లో సత్తా చాటిన బాబర్‌కు ఎవరూ సాటిరారని.. అతడే పాక్‌ కెప్టెన్‌గా ఉండాలని పేర్కొనడం గమనార్హం.

చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్‌ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు
Ind Vs NZ: రాంచిలో మ్యాచ్‌ అంటే అంతే! టాస్‌ గెలిస్తే... 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top