నోటితో కాదు.. ఆటతో సమాధానం చెప్పు: సెహ్వాగ్‌ ఫైర్‌ | Even Said Endulkar Keep Quiet: Sehwag Questions Rahane Outburst | Sakshi
Sakshi News home page

నోటితో కాదు.. ఆటతో సమాధానం చెప్పు: సెహ్వాగ్‌ ఫైర్‌

Apr 7 2026 3:03 PM | Updated on Apr 7 2026 4:12 PM

Even Said Endulkar Keep Quiet: Sehwag Questions Rahane Outburst

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) కెప్టెన్‌ అజింక్య రహానే వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అసహనం వ్యక్తం చేశాడు. విమర్శకులకు కౌంటర్‌ ఇస్తూ రహానే సమయాన్ని వృథా చేసుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌తో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ల పేర్లను వీరూ ప్రస్తావించాడు.

గతేడాది కేకేఆర్‌ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు రహానే. ఐపీఎల్‌-2025 సీజన్‌లో కేకేఆర్‌ దారుణ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో ఒకటి కూడా గెలవలేకపోయింది.

వారినే అడగండి!
భారీ అంచనాలతో రూ. 25 కోట్లకు పైగా వెచ్చించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ను కొనుగోలు చేస్తే.. అతడు ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో బౌలింగ్‌ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో రహానే స్పందిస్తూ.. గ్రీన్‌ బౌలింగ్‌ ఎందుకు చేయడం లేదో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)నే అడగాలనే అనుచితంగా మాట్లాడాడు.

అసూయతోనే
ఇందుకు సీఏ సైతం బదులిచ్చింది. గ్రీన్‌ వెన్నునొప్పి కారణంగా ఎక్కువగా బౌలింగ్‌ చేయలేడన్న విషయం కేకేఆర్‌కు ముందుగానే చెప్పామని పేర్కొంది. ఇక తన స్ట్రైక్‌రేటు గురించి వస్తున్న విమర్శలపై రహానే స్పందిస్తూ.. ‘‘నాపై ఎందుకంత ద్వేషం.. నేను ఆడకూడదా? అయినా నాపై అసూయతోనే కొందరు ఇలా మాట్లాడుతున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఈ రెండు సందర్భాల్లో రహానే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వీరేందర్‌ సెహ్వాగ్‌ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అతడు ఓ జట్టుకు కెప్టెన్‌. కామెరాన్‌ గ్రీన్‌ గురించి అడిగినపుడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకవేళ మాట్లాడినా నేరుగా సమాధానం ఇవ్వకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియాను అడగమని చెప్పడం దేనికి?

‘ఎండుల్కర్‌’ అంటూ..
ఇక స్ట్రైక్‌రేటు విషయానికొస్తే.. బాగా ఆడినపుడు ప్రశంసించే వాళ్లు కొన్నిసార్లు విమర్శిస్తారు కూడా! అంత మాత్రాన ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటూ పోవడం సరికాదు. గ్రీన్‌ విషయంలో ఒకలా.. తన విషయంలో మరోలా రహానే స్పందించాడు.

ఒకానొక సందర్భంలో సచిన్‌ టెండుల్కర్‌ గురించి.. ‘ఎండుల్కర్‌’ అంటూ కెరీర్‌ ముగిసిపోయిందనే వార్తలు రాశారు. కానీ సచిన్‌ వాటిని పట్టించుకోకుండా ఆటతో సమాధానమిచ్చి అందనంత ఎత్తుకు ఎదిగాడు. అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఎప్పుడూ విమర్శకులను సమాధానం ఇస్తూ సమయం వృథా చేయలేదు.

కాబట్టి రహానే నిశ్శబ్దంగా ఉండటం మంచిది. నోటితో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలి. ఒక్క సెంచరీ చేస్తే అంతా సైలెంట్‌ అయిపోతారు. అంతమాత్రానికి ఇలాంటి మాటలు ఎందుకు?’’ అని సెహ్వాగ్‌ రహానే తీరును విమర్శించాడు.

చదవండి: RR vs MI: ‘వైభవ్‌ సూర్యవంశీ గురించి తెలుసు.. అతడికి అంత సీన్‌ లేదు’

Advertisement
 
Advertisement
Advertisement