వరుణుడి ఖాతాలో... | Kolkata vs Punjab Kings match called off due to rain | Sakshi
Sakshi News home page

వరుణుడి ఖాతాలో...

Apr 7 2026 4:18 AM | Updated on Apr 7 2026 4:18 AM

Kolkata vs Punjab Kings match called off due to rain

వర్షం కారణంగా కోల్‌కతా, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ రద్దు 

ఇరు జట్లకు చెరో పాయింట్‌  

కోల్‌కతా: ఐపీఎల్‌ 19వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. ఆట ప్రారంభమైన 15 నిమిషాలకే వర్షం ముంచెత్తింది. మైదానం మొత్తాన్ని కవర్స్‌తో కప్పినా... ఎంతకూ వరుణుడు తెరిపినివ్వకపోవడంతో ఆట సాధ్యపడలేదు. పలుమార్లు పిచ్‌ను పరిశీలించిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

దేశంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్ధ ఉన్న ఈడెన్‌ గార్డెన్స్‌లో కటాఫ్‌ సమయానికి ముందే వరుణుడు శాంతించాడు. అయితే బౌండరీకి దగ్గర నీరు ఎక్కువగా నిలిచింది. దాంతో ఐదు ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించేందుకు కటాఫ్‌ సమయానికల్లా మైదానం సిద్ధమయ్యే పరిస్థితి కనిపించలేదు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్‌ రద్దు కావడం ఇదే తొలిసారి కాగా... ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. 

గతేడాది కూడా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. సొంతగడ్డపై టాస్‌ గెలిచిన కోల్‌కతా మొదట బ్యాటింగ్‌ ఎంచుకోగా... వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఫిన్‌ అలెన్‌ (6), కామెరాన్‌ గ్రీన్‌ (4) విఫలం కాగా... కెప్టెన్‌ అజింక్య రహానే (8 నాటౌట్‌), అంగ్‌క్రిష్‌ రఘువంశీ (7) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో పంజాబ్‌ పేసర్‌ జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఈ ఇద్దరినీ కీపర్‌ క్యాచ్‌ల ద్వారా వెనక్కి పంపాడు.

Advertisement
 
Advertisement
Advertisement