ప్రపంచ రికార్డుతో పసిడి పతకం గెలిచిన షూటర్‌ ఇషా సింగ్‌ | Esha Singh breaks World Records to win 25m Pistol Women gold | Sakshi
Sakshi News home page

ప్రపంచ రికార్డుతో పసిడి పతకం గెలిచిన షూటర్‌ ఇషా సింగ్‌

May 28 2026 5:12 AM | Updated on May 28 2026 5:12 AM

Esha Singh breaks World Records to win 25m Pistol Women gold

మ్యూనిక్‌: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ పతకాల బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇషా సింగ్‌ కొత్త ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ఇషా సింగ్‌ 43 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 

అదే క్రమంలో 42 పాయింట్లతో 2024లో కిమ్‌ యెజీ (దక్షిణ కొరియా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును కూడా ఇషా సింగ్‌ బద్దలు కొట్టింది. డొరీన్‌ (జర్మనీ; 38 పాయింట్లు) రజత పతకం... మిరోస్లావా (బల్గేరియా; 31 పాయింట్లు) కాంస్య పతకం గెల్చుకున్నారు. అంతకుముందు 98 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్‌ 587 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత్‌కే చెందిన మనూ భాకర్‌ 582 పాయింట్లతో 12వ స్థానంలో, రాహీ సర్నోబత్‌ 581 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. టాప్‌–8 వారికి మాత్రమే  ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement