
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా అతి భారీ విజయం నమోదు చేసింది. సౌతాఫ్రికాతో నిన్న (సెప్టెంబర్ 7) జరిగిన మ్యాచ్‌లో 342 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో ఈ ఘనత సాధించింది. 54 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇంతటి భారీ విజయాన్ని ఏ జట్టు సాధించలేదు.
ఇంగ్లండ్‌కు ముందు ఈ రికార్డు భారత్ పేరిట ఉంది. టీమిండియా 2023 జనవరిలో శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియా, జింబాబ్వే.. ఇంగ్లండ్, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్‌లో ఆస్ట్రేలియా నెదర్లాండ్స్‌పై 309 పరుగుల తేడాతో.. 2023 జూన్‌లో జింబాబ్వే యూఎస్‌ఏపై 304 పరుగుల తేడాతో గెలుపొందాయి.
కాగా, స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన (సౌతాంప్టన్) మూడో వన్డేలో ఇంగ్లండ్‌ఈ చారిత్రక విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ చరిత్ర సృష్టించగలిగింది. ఎందుకుంటే, ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన సౌతాఫ్రికా అప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
రూట్, బేతెల్ శతకాలు
టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (100), జేకబ్ బేతెల్ (110) శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (62), జోస్ బట్లర్ (62 నాటౌట్) కూడా మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు.
బెన్ డకెట్ 31, కెప్టెన్ బ్రూక్ 3 పరుగులకు ఔట్ కాగా.. విల్ జాక్స్ 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించున్నారు. కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ తలో 2 వికెట్లు తీశారు.
నిప్పులు చెరిగిన ఆర్చర్.. బెంబేలెత్తిపోయిన సౌతాఫ్రికా బ్యాటర్లు
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. జోఫ్రా ఆర్చర్ (9-3-18-4), బ్రైడన్ కార్స్ (6-1-33-2), ఆదిల్ రషీద్ (3.5-0-13-3) ధాటికి కనీసం సగం ఓవర్లు కూడా ఆడలేక 20.5 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. సౌతాఫ్రికాకు వన్డే క్రికెట్‌లో ఇది అతి భారీ పరాజయం. ఆ జట్టుకు వన్డేల్లో ఇది రెండో అత్యల్స స్కోర్ (72) కూడా.
ఈ మ్యాచ్‌లో ఆర్చర్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కార్బిన్ బాష్ చేసిన 20 పరుగులే అత్యధికం. అరంగేట్రం నుంచి వరుసగా 5 మ్యాచ్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు చేసి చరిత్ర సృష్టించిన మాథ్యూ బ్రీట్జ్కీ (4) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మంచి ఫామ్‌లో ఉండిన మార్క్రమ్, ముల్దర్ డకౌట్లయ్యారు. రికెల్టన్ 1 పరుగుకే వెనుదిరిగాడు. విధ్వంసకర ఆటగాళ్లు స్టబ్స్ (10), బ్రెవిస్ (6) చేతులెత్తేశారు.