
టీమిండియాతో నాలుగో టెస్టుకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మంగళవారం ప్రకటింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి ఎడమచేతి వాటం స్పిన్నర్ లియామ్ డాసన్ పునరాగమనం చేశాడు. లార్డ్స్ టెస్టులో గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్‌ను ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఈ విషయాన్ని ఈసీబీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మూడో టెస్టులో బషీర్ చేతి వేలికి గాయం కావడంతో మిగిలిన రెండు టెస్టులకు బషీర్ దూరమయ్యాడు. డాసన్ చివరగా 2017లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. డొమాస్టిక్ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుండడంతో డాసన్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.

అతడికి బ్యాట్‌తో రాణించే సత్తా కూడా ఉంది. దీంతో తుది జట్టులో అతడికి చోటు దక్కడం దాదాపు ఖాయమన్పిస్తోంది. ఇక తొలి మూడు టెస్టులో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. అదేవిధంగా ఇంగ్లండ్ టెస్టు జట్టులో భాగంగా ఉన్న జేమీ ఓవర్టన్, సామ్ కుక్, తిరిగి కౌంటీ క్రికెట్‌లోకి ఆడేందుకు వారిని ఈసీబీ రిలీజ్ చేసింది. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.
లార్డ్స్‌లో హార్ట్ బ్రేకింగ్..
ఇక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ పోరాడి ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 22 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యఛేదనలో 170 రన్స్‌కు గిల్ సేన ఆలౌటైంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 61 నాటౌట్) విరోచిత పోరాటం కనబరిచినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కార్స్ రెండు, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు
బెన్ స్టోక్స్ (డర్హామ్) - కెప్టెన్, జోఫ్రా ఆర్చర్ (సస్సెక్స్), గస్ అట్కిన్సన్ (సర్రే), జాకబ్ బెథెల్ (వార్విక్‌షైర్), హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), బ్రైడాన్ కార్స్ (డర్హామ్), జాక్ క్రాలే (కెంట్), లియామ్ డాసన్ (హాంప్‌షైర్), బెన్ డకెట్ (నాటింగ్‌హామ్‌షైర్), ఓలీ పోప్ (సర్రే), జో రూట్ (యార్క్‌షైర్), జేమీ స్మిత్ (సర్రే), జోష్ టంగ్ (నాటింగ్‌హామ్‌షైర్), క్రిస్ వోక్స్ (వార్విక్‌షైర్)