
వన్డేల్లో పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించిన ఇంగ్లండ్
జో రూట్, బెథెల్ సెంచరీలు
చివరి వన్డేలో ఘోరంగా ఓడిన దక్షిణాఫ్రికా
సౌతాంప్టన్: వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు అరుదైన రికార్డు తమ పేరిట లిఖించకుంది. దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో ఓడి ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఆఖరి వన్డేలో విశ్వరూపం కనబర్చింది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల విజృంభణ తోడవడంతో ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది.
అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కాగా... రెండేళ్ల క్రితం శ్రీలంకపై భారత్ నమోదు చేసుకున్న 317 పరుగుల గెలుపు రెండో స్థానానికి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది.
21 ఏళ్ల జాకబ్ బెథెల్ (82 బంతుల్లో 110; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), సీనియర్ ప్లేయర్ జో రూట్ (96 బంతుల్లో 100; 6 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా... జేమీ స్మిత్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (32 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆరంభం నుంచే ఇంగ్లండ్ బ్యాటర్లు ధాటిగా ఆడగా... ఆఖర్లో బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20.5 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటైంది. గత రెండు మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సఫారీలు... భారీ లక్ష్యఛేదనలో పోరాడకుండానే చేతులెత్తేశారు. కార్బిన్ బాష్ (20), కేశవ్ మహరాజ్ (17), ట్రిస్టన్ స్టబ్స్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మార్క్‌రమ్ (0), రికెల్టన్ (1), ముల్డర్ (0), బ్రిట్జ్‌కీ (4), బ్రేవిస్ (6) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (4/18), ఆదిల్ రషీద్ (3/13) విజృంభించారు. ఆర్చర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... రూట్, కేశవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది.