బ్యాటర్లదే భారం | England all out for 192 in their second innings | Sakshi
Sakshi News home page

బ్యాటర్లదే భారం

Jul 14 2025 4:20 AM | Updated on Jul 14 2025 4:20 AM

England all out for 192 in their second innings

భారత్‌ లక్ష్యం 193, ప్రస్తుతం 58/4

టీమిండియాకు 135 పరుగుల దూరంలో లార్డ్స్‌ విజయం

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 192 ఆలౌట్‌

సుందర్‌కు 4 వికెట్లు 

రాణించిన సిరాజ్, బుమ్రా  

లార్డ్స్‌ విజేత... సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లే జట్టేదో నేడు తేలనుంది. నాలుగో రోజు 14 వికెట్లు పడ్డాయి. ఆఖరి రోజూ వికెట్ల జోరు కొనసాగితే మాత్రం ఎవరి అంచనాలకు అందని ఫలితమే వస్తుంది. పిచ్‌ మారుతున్న ధోరణి, బ్యాటర్లకు ఎదురవుతోన్న పరిస్థితి చూస్తుంటే... అగ్ని పరీక్ష తప్పదేమో! దీంతో బంతిని ఎదుర్కోవడం కంటే ప్రతి ఓవర్లో బ్యాటర్లు సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్‌ను మిగిలున్న 135 పరుగుల లక్ష్యం ఊరిస్తుంటే... పిచ్‌ ఇంగ్లండ్‌ను ఉత్సాహపరుస్తోంది.   

లండన్‌: భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మూడో టెస్టు ఆఖరి మజిలీకి చేరింది. మూడో రోజు ముగిసేసరికి సమంగా నిలిచిన జట్లు... నాలుగో రోజు బౌలర్ల పట్టుదలకు తలొగ్గాయి. భారత బ్యాటర్లు రాణిస్తే గెలుపు... ఇంగ్లండ్‌ బౌలర్లు పడగొడితే ముప్పు... ఏదేమైనా ఐదో రోజు ఆట రసవత్తర ముగింపునకు తెరలేపనుంది. ఇంగ్లండ్‌ను 200 పరుగుల్లోపే ఆలౌట్‌ చేశామన్న ఆనందాన్ని భారత టాపార్డర్‌ వికెట్లు ఆవిరి చేశాయి. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌... ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. 

కేఎల్‌ రాహుల్‌ (47 బంతుల్లో 33 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బ్రైడన్‌ కార్స్‌ 2 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌ మొదలైన రెండో ఓవర్లోనే యశస్వి జైస్వాల్‌ (0) నిర్లక్ష్యంగా వికెట్‌ను పారేసుకోగా... కరుణ్‌ నాయర్‌ (14), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (6) కార్స్‌ అద్బుతమైన బంతులకు వికెట్ల ముందు దొరికిపోయారు. ‘నైట్‌వాచ్‌మన్‌’ ఆకాశ్‌దీప్‌ (1)ను స్టోక్స్‌ క్లీన్‌బౌల్ట్‌ చేశాడు. 

భారత్‌ చేతిలో 6 వికెట్లుండగా... గిల్‌ బృందం విజయానికి 135 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 62.1 ఓవర్లలో 192 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్‌ (96 బంతుల్లో 40; 1 ఫోర్‌), కెపె్టన్‌ బెన్‌ స్టోక్స్‌ (96 బంతుల్లో 33; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ 12.1–2–22–4 చక్కని స్పెల్‌తో తిప్పేశాడు. 

సిరాజ్‌ మొదలుపెడితే... 
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 2/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ను సిరాజ్‌ తన పేస్‌ బౌలింగ్‌తో వణికించాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో డకెట్‌ (12)ను అవుట్‌ చేశాడు. కాసేపటికి ఒలీ పోప్‌ (4)ను ఎల్బీగా పంపాడు. సిరాజ్‌ పేస్‌ను గమనించిన కెప్టెన్ గిల్‌ మరో ఎండ్‌లో బుమ్రాను తప్పించి నితీశ్‌ కుమార్‌కు బంతిని అప్పగించడం ఫలితాన్నిచ్చింది. ఓపెనర్‌ క్రాలీ (22)ని నితీశ్‌ అవుట్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ అతని వికెట్‌ను నితీశే తీశాడు. దీంతో 50 పరుగులకే ఇంగ్లండ్‌ 3 టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. 

ఈ దశలో రూట్, హ్యారీ బ్రూక్‌ నిలబడేందుకు చేసిన ప్రయత్నం లంచ్‌వరకైనా నిలువలేదు. ఆకాశ్‌దీప్‌ ఓవర్లో మిడాఫ్‌ దిశగా భారీ సిక్సర్‌ బాదిన బ్రూక్‌ అదే జోరులో స్వీప్‌షాట్‌ ఆడే యత్నంలో బోల్తా పడ్డాడు. స్టంప్స్‌ లక్ష్యంగా సంధించిన ఆకాశ్‌ బంతి బ్రూక్‌ మిడిల్‌ స్టంప్‌ను పడేసింది. దీంతో 87 పరుగుల వద్ద అతను క్లీన్‌»ౌల్డ్‌ కావడంతో ఇంగ్లండ్‌ కీలకమైన నాలుగో వికెట్‌ కోల్పోయింది. 98/4 వద్ద లంచ్‌బ్రేక్‌కు వెళ్లారు. 

సుందర్‌ ఉచ్చులో... 
రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ తేరుకుంది. ఇటు రూట్, అటు కెప్టెన్  స్టోక్స్‌ నిలకడగా ఆడారు. పిచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ చేశారు. దీంతో ఈ సెషన్‌లో భారత బౌలర్లు పడిన కష్టానికి తగిన ఫలితమైతే రాలేదు. అయితే సుందర్‌ మాయాజాలం మొదలవడంతో జట్టు స్కోరు 150 దాటిన తర్వాత రూట్, స్వల్ప వ్యవధిలోనే స్మిత్‌ (8) అవుటయ్యారు. 

ఈ సెషన్‌లో కేవలం 2 వికెట్లనే కోల్పోయి 77 పరుగులు జతచేసింది. అయితే మూడో సెషన్‌ ఇంగ్లండ్‌ను ముంచింది. స్టోక్స్‌ వికెట్‌ను పడేయడంతో సుందర్‌ ఆలౌట్‌కు సిద్ధం చేశాడు. వోక్స్‌ (10), కార్స్‌ (1)లను బుమ్రా బౌల్డ్‌ చేయగా, బషీర్‌ (2)ను బౌల్డ్‌ చేసి సుందర్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. 

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 387; భారత్‌ తొలిఇన్నింగ్స్‌: 387; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) జైస్వాల్‌ (బి) నితీశ్‌ 22; డకెట్‌ (సి) బుమ్రా (బి) సిరాజ్‌ 12; పోప్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 4; జో రూట్‌ సుందర్‌ 40; బ్రూక్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 23; స్టోక్స్‌ (బి) సుందర్‌ 33; స్మిత్‌ (బి) సుందర్‌ 8; వోక్స్‌ (బి) బుమ్రా 10; కార్స్‌ (బి) బుమ్రా 1; ఆర్చర్‌ (నాటౌట్‌) 5; బషీర్‌ (బి) సుందర్‌ 2; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం (62.1 ఓవర్లలో ఆలౌట్‌) 192. వికెట్ల పతనం: 1–22, 2–42, 3–50, 4–87, 5–154, 6–164, 7–181, 8–182, 9–185, 10–192. బౌలింగ్‌: బుమ్రా 16–3–38–2, సిరాజ్‌ 13–2–31–2, నితీశ్‌ 5–1–20–1, ఆకాశ్‌దీప్‌ 8–2–30–1, జడేజా 8–1–20–0, సుందర్‌ 12.1–2–22–4. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 0; రాహుల్‌ (బ్యాటింగ్‌) 33; కరుణ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కార్స్‌ 14; గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కార్స్‌ 6; ఆకాశ్‌ దీప్‌ (బి) స్టోక్స్‌ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 58. వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58. బౌలింగ్‌: వోక్స్‌ 5–2–11–0, ఆర్చర్‌ 4–0–18–1, స్టోక్స్‌ 4.4–0–15–1, కార్స్‌ 4–1–11–2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement