
గత ఐదారేళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జో రూట్.. ప్రస్తుతం వన్డేల్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం వరకు రూట్‌కు కేవలం టెస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ముద్ర ఉండేది. ఈ ముద్రను రూట్ ఇటీవలికాలంలో చెరిపేశాడు. వన్డేల్లోనూ వరుస పెట్టి సెంచరీలు చేస్తూ, పరుగుల వరద పారిస్తూ సత్తా చాటుతున్నాడు.
ఈ ఏడాది రూట్ ఇప్పటికే 3 వన్డే శతకాలు చేశాడు. తాజాగా సౌతాఫ్రికాపై చేసిన సెంచరీ అతని వన్డే కెరీర్‌లో 19వది. మొత్తం కెరీర్‌లో 58వది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో కోహ్లి (82) తర్వాత అత్యధిక సెంచరీలు రూట్ పేరిటే ఉన్నాయి. సెంచరీల విషయంలో రూట్ తన సమకాలిక దిగ్గజాలైన రోహిత్ శర్మ (49), కేన్ విలియమ్సన్ (48), స్టీవ్ స్మిత్‌ను (48) దాటేసి మరింత దూరం వెళ్లిపోతున్నాడు.
తాజాగా సౌతాఫ్రికాపై చేసిన సెంచరీతో బాబర్ ఆజమ్, బ్రియాన్ లారా, మహేల జయవర్ధనే సరసన చేరాడు. వీరంతా వన్డేల్లో తలో 19 సెంచరీలు చేశారు. తాజా చేసిన సెంచరీ రూట్ ఇంగ్లండ్ గడ్డపై 10వది. ఈ సెంచరీతో అతను స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా ట్రెస్కోథిక్ రికార్డును బద్దలు కొట్టాడు.
వన్డేల్లో ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు (19), పరుగులు (7301) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న రూట్.. ఈ ఏడాది ఈ ఫార్మాట్‌లోనూ కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది రూట్ 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఫ్యాబ్ ఫోర్‌లో రూట్.. కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్నాడు.
సౌతాఫ్రికాతో మ్యాచ్ విషయానికొస్తే.. రూట్‌తో పాటు యువ ఆటగాడు జేకబ్ బేతెల్ కూడా సెంచరీతో చెలరేగడం, ఆతర్వాత బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఇంగ్లండ్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది.