
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ (Simranjeet Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్ననాడు గిల్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేశానని.. అయితే, ఇప్పుడు అతడికి తాను గుర్తున్నానో లేదో తెలియదని అన్నాడు. కాగా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ ఊహించని పరిస్థితుల్లో యూఏఈకి చేరుకున్నాడు.
ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో అక్కడే ఉండిపోయాడు. జూనియర్లకు కోచ్‌గా వ్యవహరిస్తూనే.. యూఏఈ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో పన్నెండు టీ20 మ్యాచ్‌లు ఆడిన సిమ్రన్‌జీత్ సింగ్ పదిహేను వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు ఆసియా కప్-2025 రూపంలో మేజర్ టోర్నీ ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు.
తొలి మ్యాచ్‌లోనే టీమిండియాతో ఢీ
కాగా సొంతగడ్డపై జరుగనున్న ఈ ఖండాంతర టోర్నీలో యూఏఈ.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఇరుజట్లు సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సిమ్రన్‌జీత్ సింగ్ గిల్‌తో తనకున్న జ్ఞాపకాలు, తన క్రికెట్ ప్రయాణం గురించి తెలిపాడు.
గిల్ చిన్నప్పటి నుంచే తెలుసు
‘‘శుబ్‌మన్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. అయితే, ప్రస్తుతం తనకు నేను గుర్తున్నానో లేదో తెలియదు. 2011-12లో మొహాలీలో ఉన్న పంజాబ్ క్రికెట్ అకాడమీలో ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మేము ప్రాక్టీస్ చేసేవాళ్లం.
శుబ్‌మన్ వాళ్ల నాన్నతో కలిసి పదకొండు గంటలకు అక్కడికి వచ్చేవాడు. నేను కాసేపు ఎక్కువ సమయం అక్కడే ఉండేవాడిని గనుక గిల్‌కు బౌలింగ్ చేసేవాడిని. అయితే, ఇప్పుడు తను నన్ను గుర్తుపట్టగలడో లేదో తెలియదు’’ అని 35 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.
అనూహ్య పరిస్థితుల్లో
అదే విధంగా.. ‘‘పంజాబ్ జట్టుకు జిల్లా స్థాయిలో చాలా మ్యాచ్‌లే ఆడాను. 2017 రంజీ ప్రాబబుల్స్‌లోనూ నాకు చోటు దక్కింది. అంతేకాదు ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ మొహాలీలో మ్యాచ్ ఆడినప్పుడల్లా నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడిని.
అయితే, 2021 ఏప్రిల్‌లో దుబాయ్‌లో ఇరవై రోజుల పాటు ప్రాక్టీస్ చేసేందుకు నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడే కోవిడ్ రెండో దశ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇండియాలో మరోసారి లాక్‌డౌన్ విధించారు. దీంతో నేను దుబాయ్‌లోనే మరి కొన్నినెలల పాటు ఉండిపోవాల్సి వచ్చింది.
సెంట్రల్ కాంట్రాక్టు కూడా
అప్పటి నుంచి దుబాయ్‌లోనే సెటిల్ అయ్యాను. జూనియర్ ఆటగాళ్లకు కోచింగ్ ఇవ్వడం ద్వారా మంచిగానే సంపాదించాను. క్లబ్ క్రికెట్ ఆడేవాడిని కూడా!.. అలా కుటుంబాన్ని పోషించుకునేవాడిని.
ఈ క్రమంలోనే యూఏఈ జట్టులోకి వచ్చాను. యూఏఈ బోర్డు నాకు సెంట్రల్ కాంట్రాక్టు కూడా ఇచ్చింది. అప్పటి నుంచి నా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగైంది’’ అని సిమ్రన్‌జీత్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఇటీవలే తిరిగి నియమితుడయ్యాడు. ఇక సెప్టెంబరు 9- 28 వరకు టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ జరుగనుంది.
చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు