ఫిట్‌గా లేకున్నా ఆడాను!.. నీ బాధేంటో అర్థం కావట్లేదు! | Do not make such statements: Manoj Tiwary Slams Riyan Parag | Sakshi
Sakshi News home page

నేను ఫిట్‌గా లేకున్నా ఆడాను!.. నీ బాధేంటో అర్థం కావట్లేదు!

May 25 2026 11:22 AM | Updated on May 25 2026 11:35 AM

Do not make such statements: Manoj Tiwary Slams Riyan Parag

రాజస్తాన్‌ రాయల్స్‌ పూర్తిస్థాయి కెప్టెన్‌గా రియాన్‌ పరాగ్‌ ఐపీఎల్‌-2026లో సత్తా చాటాడు. వ్యక్తిగతంగా విమర్శలపాలైనా.. జట్టును ప్లే ఆఫ్స్‌ చేర్చడంలో సఫలమయ్యాడు. కాగా ‘ప్లే ఆఫ్స్‌’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి పోరులో 30 పరుగుల తేడాతో రాజస్తాన్‌ గెలుపొందింది. చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ విఫలమైనా... మిగిలిన వాళ్లంతా తలా కొన్ని పరుగులు చేయడంతో రెండొందల మార్క్‌ దాటింది రాయల్స్‌.

ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై బ్యాటర్ల పనిబట్టింది. బ్యాటింగ్‌లో భారీ సిక్స్‌లతో రెచ్చిపోయిన జోఫ్రా ఆర్చర్‌... బౌలింగ్‌లో కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను రాజస్తాన్‌ వైపు తిప్పాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం రియాన్‌ పరాగ్‌ మాట్లాడిన తీరును భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి విమర్శించాడు.

నేను ఫిట్‌గా లేకున్నా ఆడాను!
ముంబైతో మ్యాచ్‌ తర్వాత రియాన్‌ పరాగ్‌ మాట్లాడుతూ.. ‘‘నేనసలు ఫిట్‌గా లేను. ఈరోజు అసలు ఈ మ్యాచ్‌ ఆడాల్సింది కాదు. మానసికంగా కఠినమైన స్థితిలో ఉన్నాను. అయితే, జోఫ్రా ఓటమి​కి అడ్డుగోడలా నిలిచి.. మా విజయానికి బాటలు వేశాడు.

జడ్డూ భాయ్‌ (రవీంద్ర జడేజా) కూడా ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల బాధపడుతున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు త్వరలోనే ఫిట్‌గా మారి తిరిగి వస్తాడు’’ అని తెలిపాడు.

 నీ బాధేంటో అర్థం కావట్లేదు!
ఈ వ్యాఖ్యలపై కామెంటేటర్‌ మనోజ్‌ తివారి స్పందించాడు. ‘‘రియాన్‌ పరాగ్‌ అసలు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో నాకసలు అర్థం కాలేదు. గాయపడినా.. మానసికంగా సిద్ధంగా లేకపోయినా ఆడానని చెబుతున్నాడు. వర్క్‌లోడ్‌ కారణంగా రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చినట్లు తెలిపాడు.

కెప్టెన్‌గా రియాన్‌ సంతోషించాలి
కానీ ఫీల్డింగ్‌ కోచ్‌ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడాడు. అంతా గందరగోళంగా ఉంది. జట్టు ప్లే ఆఫ్స్‌ చేరినందుకు కెప్టెన్‌గా రియాన్‌ సంతోషించాలి. అంతేగానీ ఇలాంటి సమయంలో పొంతనలేని స్టేట్‌మెంట్ల ద్వారా అందరినీ కన్‌ఫ్యూజ్‌ చేయడం సరికాదు’’ అని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు. 

కాగా వ్యక్తిగతంగా రియాన్‌ పరాగ్‌పై విమర్శలేమీ కొత్తకాదు. ఈ సీజన్‌లో ఇప్పటికే చట్టవిరుద్ధంగా ‘వేపింగ్’ (ఇ- సిగరెట్‌) చేసి దొరికిపోయిన ఈ అసోం ఆల్‌రౌండర్‌కు బీసీసీఐ జరిమానా వేసింది. కాగా ముంబైతో మ్యాచ్‌లో రియాన్‌ 8 బంతుల్లో కేవలం 14 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే.. ముల్లన్‌పూర్‌లో బుధవారం జరగనున్న ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు తొలి క్వాలిఫయర్‌లో మంగళవారం గుజరాత్‌తో బెంగళూరు తలపడనుంది.

చదవండి: అప్పుడేమో అలా.. ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు?: సెహ్వాగ్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement