మూణ్ణెళ్ల కింద రాజీనామా.. ఇప్పుడు రికార్డు పుటల్లోకి! | Dick Advocaat Curacao manager will be oldest in World Cup history | Sakshi
Sakshi News home page

మూడు నెలల కింద రాజీనామా.. ఇప్పుడు రికార్డు పుటల్లోకి!

May 14 2026 3:07 PM | Updated on May 14 2026 3:18 PM

Dick Advocaat Curacao manager will be oldest in World Cup history

రికార్డు పుటల్లోకి డిక్‌ అడ్వోకాట్‌

78 ఏళ్ల వయస్సులో జాతీయ జట్టు కోచ్‌గా బరిలోకి

ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలో అతిపెద్ద వయస్కుడిగా ఘనత

కురసావ్‌ జట్టుకు మళ్లీ శిక్షణ ఇవ్వనున్న నెదర్లాండ్స్‌ దిగ్గజం  

కేవలం 1,56,000 జనాభా ఉన్న కురసావ్‌ దేశం వచ్చే నెలలో చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. 96 ఏళ్ల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో ఆడనున్న అతిచిన్న దేశంగా (జనాభా, వైశాల్యం పరంగా) కురసావ్‌ జట్టు గుర్తింపు పొందనుంది. ఈ జట్టుగా హెడ్‌ కోచ్‌గా ఉన్న డిక్‌ అడ్వోకాట్‌ కూడా రికార్డు నెలకొల్పనున్నాడు. 

ప్రపంచకప్‌ చరిత్రలోనే ఒక జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్న అతిపెద్ద వయస్కుడిగా  78 ఏళ్ల అడ్వోకాట్‌ (Dick Advocaat) గుర్తింపు పొందనున్నాడు. గతంలో ఈ రికార్డు ఒట్టో రెహగల్‌ పేరిట ఉంది. 2010 ప్రపంచకప్‌లో గ్రీస్‌ జట్టుకు రెహగల్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్నపుడు ఆయన వయస్సు 71 ఏళ్లు. 

గ్రూప్‌ ‘ఇ’లో ఉన్న కురసావ్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 14న హ్యూస్టన్‌లో జర్మనీ జట్టుతో ఆడనుంది. నెదర్లాండ్స్‌కు చెందిన అడ్వోకాట్‌ శిక్షణలోనే కురసావ్‌ దేశం మొదటిసారి ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించింది. రెండేళ్లపాటు కురసావ్‌ జట్టుకు కోచ్‌గా ఉన్న అడ్వోకాట్‌ మూడు నెలల క్రితం కుటుంబకారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. 

ఈ మూడు నెలల కాలంలో కురసావ్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ఫ్రెడ్‌ రుటెన్‌ ఆధ్వర్యంలో ఆశించిన ఫలితాలు రాలేదు. చైనా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో కురసావ్‌ ఓడిపోయింది. కురసావ్‌ జట్టులోని సీనియర్‌ ప్లేయర్లకు కూడా రుటెన్‌ శిక్షణ పద్ధతులు నచ్చలేదు. 

సీనియర్‌ ప్లేయర్లందరూ మళ్లీ అడ్వోకాట్‌ను కోచ్‌గా తేవాలని కురసావ్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్యను కోరారు. దాంతో కురసావ్‌ సమాఖ్య... అడ్వోకాట్‌ను సంప్రదించగా ఆయన కోచ్‌గా మళ్లీ వచ్చేందుకు అంగీకరించారు. 

ఫుట్‌బాల్‌ సర్కిల్‌లో ‘ద లిటిల్‌ జనరల్‌’గా పేరున్న అడ్వోకాట్‌కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. హెడ్‌ కోచ్‌గా అడ్వోకాట్‌కిది మూడో ప్రపంచకప్‌ కానుంది. 1994లో నెదర్లాండ్స్‌ జట్టుకు... 2006లో దక్షిణ కొరియా జట్టుకు ఆయన కోచ్‌గా ఉన్నారు. అంతేకాకుండా బెల్జియం, యూఏఈ, రష్యా, సెర్బియా, ఇరాక్‌ జట్లకు, 16 ప్రొఫెషనల్‌ క్లబ్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు.    

Advertisement
 
Advertisement
Advertisement