
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జూరిచ్ డైమండ్ లీగ్-2025 రన్నరప్‌గా నిలిచాడు. గురువారం జ్యూరిచ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో నీరజ్ తొలి స్దానాన్ని దక్కించుకోలేకపోయాడు. నీరజ్ తన ఈటెను అత్యుత్తమంగా 85.01 మీటర్ల దూరం విసిరి రెండో స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు.
అయితే డైమండ్ లీగ్ విజేతగా జర్మనీ స్టార్ ప్లేయర్ జూలియన్ వెబర్(91.51 మీ) అవతరించాడు. వెబర్ తన సంచలనాత్మక త్రోలతో అందరిని ఆశ్యర్యపరిచాడు. వెబర్ తన జావెలిన్‌ను తొలి ప్రయత్నంలో 91.37 మీటర్లు, రెండో ప్రయత్నంలో 91.51 మీటర్ల దూరం విసిరాడు.
వరల్డ్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో ఉన్న జూలియన్ వెబర్‌కు (91.51) ఇదే కెరీర్ బెస్ట్ ప్రదర్శన కావడం విశేషం. అంతకు ముందు అతడు అత్యుత్తమ ప్రదర్శన 91.06 మీటర్లగా ఉంది. ఇక ఈ పోటీలో 2012 ఒలింపిక్ ఛాంపియన్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్( 84.95) మూడో స్ధానంలో నిలిచాడు.
కాగా ఫైనల్ రౌండ్‌లో నీరజ్ రెండో స్ధానంలో నిలిచినప్పటికి తన స్దాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. ఒకనొక దశలో టాప్-2లో కూడా నిలిచే అవకాశాన్ని కోల్పోయేలా చోప్రా కన్పించాడు. తొలి ప్రయత్నంలో 84.35 మీటర్లు, రెండో ప్రయత్నంలో 82 మీటర్లు బల్లెం విసిరిన నీరజ్, తర్వాత 3 ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు.
అయితే ఈ భారత స్టార్ తన చివరి ప్రయత్నంలో 84.35 మీటర్లను విసిరి రెండో స్ధానానికి చేరుకోగలిగాడు. ఏదేమైనప్పటికి అగ్రస్ధానంలో నిలిచిన వెబర్ కంటే నీరజ్ ఆరు మీటర్లు వెనుకబడ్డాడు. ఇక వచ్చే నెలలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ జరగనున్న నేపథ్యంలో నీరజ్ తన ప్రదర్శనను మెరుగుచుకోవాలి.
టోక్యో వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో నీరజ్.. పారిస్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, వెబర్‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరిద్దరి నుంచి నీరజ్‌కు మరోసారి గట్టి పోటీ ఎదురు కానుంది.
చదవండి: అజయ్ బాబుకు స్వర్ణ పతకం