ధనాధన్‌... ఫటాఫట్‌ | Defending champions India make a good start with a solid win in the Asia Cup | Sakshi
Sakshi News home page

ధనాధన్‌... ఫటాఫట్‌

Sep 11 2025 4:10 AM | Updated on Sep 11 2025 10:05 AM

Defending champions India make a good start with a solid win in the Asia Cup

9 వికెట్లతో భారత్‌ ఘన విజయం

యూఏఈ 57 ఆలౌట్‌  

27 బంతుల్లోనే గెలిచిన టీమిండియా 

ఆదివారం పాకిస్తాన్‌తో భారత్‌ కీలక పోరు 

అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కు, ఇతర జట్లకు మధ్య ఉన్న స్థాయీభేదం ఏమిటో మరోసారి కనిపించింది. వరల్డ్‌ చాంపియన్‌ టీమిండియా ముందు పసికూనలా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జట్టు పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా ఆసియా కప్‌ టి20 టోర్నీలో భారత్‌ భారీ గెలుపుతో సత్తా చాటింది. 

భారత బౌలర్ల ధాటికి 79 బంతుల్లోనే యూఏఈ ఇన్నింగ్స్‌ ముగియగా, లక్ష్యాన్ని ఛేదించేందుకు మన జట్టుకు 27 బంతులే సరిపోయాయి. కుల్దీప్‌ యాదవ్, శివమ్‌ దూబే కలిసి 7 వికెట్లతో ప్రత్యర్థిని పడగొట్టగా... అభిషేక్‌ శర్మ జోరుతో లాంఛనం ముగిసింది. ఇక అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంలో ఆదివారం పాకిస్తాన్‌తో భారత్‌  ఆడుతుది. 

దుబాయ్‌: ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఘన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. అలీషాన్‌ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), వసీమ్‌ (22 బంతుల్లో 19; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కుల్దీప్‌ యాదవ్‌ (4/7), శివమ్‌ దూబే (3/4) బౌలింగ్‌లో చెలరేగారు. 

అనంతరం భారత్‌ 4.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసి గెలిచింది. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో మొత్తం 46 పరుగులు వచ్చాయి! అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... శుబ్‌మన్‌ గిల్‌ (9 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (7 నాటౌట్‌) కలిసి మ్యాచ్‌ను ముగించారు. 

కుల్దీప్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ జట్టుతో ఆడుతుంది. అబుదాబి లో నేడు జరిగే గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో బంగ్లాదేశ్‌ ఆడుతుంది. 

టపటపా... 
యూఏఈ ఇన్నింగ్స్‌ తొలి 21 బంతుల్లో 26 పరుగులు... ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో అలీషాన్‌ ఒక్కడే 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో కెప్టెన్‌ వసీమ్‌ మూడు ఫోర్లు బాది 12 పరుగులు రాబట్టాడు. ఈ రెండు సందర్భాలు మినహా యూఏఈ ప్రదర్శనలో చెప్పుకోవడానికేమీ లేదు. భారత బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో యూఏఈ బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్ర తడబాటు కనిపించింది. 

సింగిల్‌ కూడా తీయడం కష్టంగా మారిపోవడంతో పాటు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 26/0 నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి 32 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన టీమ్‌ సగం వికెట్లు కోల్పోవడంతో స్కోరు 50/5కి చేరింది. వీటిలో కుల్దీప్‌ ఒకే ఓవర్లో తీసిన మూడు వికెట్లు ఉన్నాయి. అనంతరం తర్వాతి 25 బంతుల్లో 7 పరుగులే చేసిన జట్టు మరో ఐదు వికెట్లు చేజార్చుకుంది. వీటిలో దూబే ఒకే ఓవర్లో తీసిన రెండు వికెట్లు ఉన్నాయి. 

భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 2, బుమ్రా 4 ఫోర్లు ఇవ్వగా... మిగతా నలుగురు బౌలర్లు కలిపి 55 బంతుల్లో ఒక్క ఫోర్‌ ఇవ్వకుండా ఒక సిక్స్‌ మాత్రం (అక్షర్‌ బౌలింగ్‌లో) ఇచ్చారు! 2024 టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత తొలిసారి భారత్‌ తరఫున టి20 మ్యాచ్‌ బరిలోకి దిగిన బుమ్రా... ఆరేళ్ల తర్వాత మొదటిసారి పవర్‌ప్లేలో మూడు ఓవర్లు వేశాడు.   

స్కోరు వివరాలు  
యూఏఈ ఇన్నింగ్స్‌: అలీషాన్‌ (బి) బుమ్రా 22; వసీమ్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 19; జోహెబ్‌ (సి) కుల్దీప్‌ (బి) వరుణ్‌ 2; రాహుల్‌ చోప్రా (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 3; ఆసిఫ్‌ ఖాన్‌ (సి) సామ్సన్‌ (బి) దూబే 2; కౌశిక్‌ (బి) కుల్దీప్‌ 2; ధ్రువ్‌ (ఎల్బీ) (బి) దూబే 1; సిమ్రన్‌జిత్‌ (ఎల్బీ) (బి) అక్షర్‌ 1; హైదర్‌ అలీ (సి) సామ్సన్‌ (బి) కుల్దీప్‌ 1; జునైద్‌ (సి) సూర్యకుమార్‌ (బి) దూబే 0; రోహిద్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో ఆలౌట్‌) 57.  వికెట్ల పతనం: 1–26, 2–29, 3–47, 4–48, 5–50, 6–51, 7–52, 8–54, 9–55, 10–57. బౌలింగ్‌: పాండ్యా 1–0–10–0, బుమ్రా 3–0– 19–1, అక్షర్‌ 3–0–13–1, వరుణ్‌ 2–0–4–1, కుల్దీప్‌ 2.1–0–7–4, దూబే 2–0–4–3.  

భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) హైదర్‌ (బి) జునైద్‌ 30; గిల్‌ (నాటౌట్‌) 20; సూర్య కుమార్‌  (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (4.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 60.  వికెట్ల పతనం: 1–48. బౌలింగ్‌: హైదర్‌ అలీ 1–0–10–0, రోహిద్‌ 1–0–15–0, ధ్రువ్‌ 1–0–13–0, జునైద్‌ 1–0–16–1, సిమ్రన్‌జిత్‌ 0.3–0–6–0.  

27 ఛేదనలో బంతుల పరంగా  భారత్‌కు ఇదే అతి వేగవంతమైన విజయం. గతంలో 39 బంతుల్లో స్కాట్లాండ్‌పై లక్ష్యాన్ని ఛేదించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement