సౌతాఫ్రికాకు భారీ షాక్‌ | David Miller Ruled Out of England T20 Series; Albie Morkel Named SA Bowling Consultant | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాకు భారీ షాక్‌

Sep 10 2025 11:27 AM | Updated on Sep 10 2025 11:33 AM

David Miller Ruled Out Of England T20I Series

ఇంగ్లండ్‌తో ఇవాల్టి నుంచి (సెప్టెంబర్‌ 10) ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ గాయం కారణంగా ఈ సిరీస్‌ మొత్తానికే దూరమయ్యాడు. 

మిల్లర్‌ ఇటీవల హండ్రెడ్ లీగ్‌లో Northern Superchargers తరఫున ఆడుతున్న సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఆ గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదు. దీంతో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని Cricket South Africa (CSA) అధికారికంగా ప్రకటించింది. 

అయితే మిల్లర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని మాత్రం ప్రకటించలేదు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఆ జట్టు 14 మంది సభ్యులతోనే కొనసాగనుంది.

మిల్లర్‌ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆడలేదు. గత కొంతకాలంగా అతను టీ20లకు మాత్రమే పరిమితమవుతున్నాడు. మిల్లర్‌ వన్డేలపై ఆసక్తి చూపనప్పటికీ.. 2027 వరల్డ్‌ కప్‌ ప్లాన్స్‌లో ఉంటాడని సౌతాఫ్రికా వన్డే కెప్టెన్‌ బవుమా తెలిపాడు. మిల్లర్‌ ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌కు దూరమైన ప్రకటన చేసిన సమయంలోనే క్రికెట్‌ సౌతాఫ్రికా మరో ప్రకటన కూడా చేసింది.

100కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న అల్బీ మోర్కెల్ ఈ సిరీస్‌కు బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించినట్లు తెలిపింది. అల్బీ సోదరుడు మోర్నీ మోర్కెల్‌ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాగా, మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ఇదివరకే ముగిసిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఇవాల్టి నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. 

కార్డిఫ్‌ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు (మాంచెస్టర్‌), మూడు (నాటింగ్హమ్‌) టీ20లు 12, 14 తేదీల్లో జరుగనున్నాయి. తొలి టీ20 కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డొనోవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, క్వెనా మాఫాకా, సెనురన్ ముతుసామి, లుంగి ఎంగిడి, లుహాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబాడా, రయాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్బ్స్, లిజాడ్ విలియమ్స్, కార్బిన్ బోష్

దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ఇంగ్లండ్ XI: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement