
వరుసగా ఐదో విజయం నమోదు
వైజాగ్‌లో ముగిసిన పీకేఎల్ మ్యాచ్‌లు
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ నెగ్గింది. గురువారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 38–28 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. దీంతో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో నెగ్గిన ఢిల్లీ 10 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది.
కెప్టెన్ అశు మలిక్ 14 పాయింట్లతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజింక్యా పవార్, ఫజల్ చెరో 5 పాయింట్లతో సారథికి అండగా నిలిచారు. రెయిడింగ్‌లో ఇరు జట్లు సమంగానే నిలిచినా... ట్యాక్లింగ్‌లో ఢిల్లీ 13 పాయింట్లు సొంతం చేసుకోగా... గుజరాత్ 5 పాయింట్లకే పరిమితమైంది. జెయింట్స్ తరఫున ప్రతీక్ 9 పాయింట్లతో పోరాడాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 40–39 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై గెలిచింది.
యు ముంబా తరఫున అమీర్ మొహమ్మద్ 12 పాయింట్లు, అనిల్ 9 పాయింట్లు సాధించారు. పట్నా తరఫున అయాన్ 21 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. గురువారంతో విశాఖపట్నం అంచె పోటీలు ముగియగా... నేటి నుంచి జైపూర్ వేదికగా టోర్నీ కొనసాగుతుంది. ఈ రోజు మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్... తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.