టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టు స్వదేశంలో భారత జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17- 27 మధ్య ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) భారత్‌తో తలపడే తమ జట్టును ప్రకటించింది.
పదిహేను మంది సభ్యులకు చోటు
ఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటు ఇచ్చినట్లు CSA తెలిపింది. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత మహిళా జట్టుతో సిరీస్ కోసం టొబొగొ మచికేను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. గాయపడిన కరాబో మెసో స్థానంలో 25 ఏళ్ల మచికేకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది.
తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక
అదే విధంగా మసబటా క్లాస్ స్థానాన్ని ఎలిజ్ మేరీ మార్క్స్ భర్తీ చేసిందన్న CSA.. టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకునే ఈ మేరకు ఇద్దరు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మహిళా జట్టు హెడ్‌కోచ్ మండ్లా మషింబియ్ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది.
ఎలిజ్, టొబొగొలను జట్టుకు ఆడించడం కోసం మేము ఆతురతగా ఎదురుచూస్తున్నాం. వాళ్లిద్దరు గొప్పగా ఆడతారని విశ్వసిస్తున్నాం. కొత్త ముఖాలకు చోటు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. యువ ఆటగాళ్లు జట్టుతో ఉంటే నూతనోత్సాహంతో ముందుకు సాగగలం’’ అని పేర్కొన్నారు. కాగా భారత్‌తో టీ20 సిరీస్‌కు లారా వొల్వర్ట్ సౌతాఫ్రికా జట్టుకు సారథ్యం వహించనుంది.
భారత్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా మహిళా జట్టు
లారా వొల్వర్ట్ (కెప్టెన్), అనికె బాష్, తజ్మిన్ బ్రిట్స్, నదినె డి క్లెర్క్, ఆనెరి డెర్క్‌సన్, అయాండా హ్లుబి, సినాలో జాఫ్తా, అయబోంగా ఖాక, సునె లుస్, టొబొగొ మచికె, ఎలిజ్ మేరీ మార్క్స్, నొంకులులెకో మలబ, కాయ్‌లా రెయ్‌నికె, తుమి సెఖుఖునె, క్లో ట్రియాన్.
సౌతాఫ్రికా- భారత్ మహిళా జట్ల టీ20 సిరీస్ షెడ్యూల్- 5 మ్యాచ్‌లు
👉తొలి టీ20- ఏప్రిల్ 17- డర్బన్
👉రెండో టీ20- ఏప్రిల్ 19- డర్బన్
👉మూడో టీ20- ఏప్రిల్ 22- జొహన్నస్‌బర్గ్
నాలుగో టీ20- ఏప్రిల్ 25- జొహన్నస్‌బర్గ్
👉ఐదో టీ20- ఏప్రిల్ 27- బెనోని.
చదవండి: సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు


