సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి తర్వాత రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలు | IPL 2026: Rajasthan Royals captain Riyan Parag comments after losing to SRH | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి తర్వాత రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలు

Apr 14 2026 8:48 AM | Updated on Apr 14 2026 8:53 AM

IPL 2026: Rajasthan Royals captain Riyan Parag comments after losing to SRH

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 13) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి రాయల్స్‌కు ఈ సీజన్‌లో మొదటిది. రాయల్స్‌​ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి, తాజా ఓటమి తర్వాత కూడా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ ఓటమి తర్వాత రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్‌లో తొలి ఓటమి కావడంతో అతనిలో పెద్దగా సీరియస్‌నెస్‌ కనిపించలేదు. తప్పిదాలను ఒప్పుకుంటూనే ఓటమిని లైట్‌గా తీసుకున్నట్లు మాట్లాడాడు. సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే సగం వికెట్లు కోల్పోయినా, బ్యాటింగ్‌ డెప్త్‌ అంటూ గొప్పలు పోయాడు. జడేజాకు బౌలింగ్‌ ఇవ్వకపోవడాన్ని, పిచ్‌ను అంచనా వేయలేకపోవడాన్ని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. సన్‌రైజర్స్‌ అరంగేట్రం సీమర్లను ప్రశంసించాడు.

అతని మాటల్లో.. 
వికెట్లు త్వరగా కోల్పోవడం  
మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. వారు బాగా బౌలింగ్‌ చేశారు. కొన్ని లెక్కలు తప్పాయి. దీన్ని ఒక చిన్న మినహాయింపు‌గా తీసుకుంటాం. ఎక్కువగా ఆలోచించం. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా 159 పరుగులు చేయడం మా బ్యాటింగ్‌ లోతుకు నిదర్శనం.

పిచ్‌ పరిస్థితులు  
కొత్త బంతి కాస్త స్టికిగా అనిపించింది. షైనింగ్‌ తగ్గాక స్లో అయ్యింది. ఓ రకంగా ఆలోచిస్తే, మొదట బ్యాటింగ్‌ చేయడం మంచిదై ఉండేది. ఏదిఏమైనా మేమే ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది.  

కొత్త సీమర్లపై ప్రశంస  
సన్‌రైజర్స్‌ తరఫున అరంగేట్రం చేసిన సీమర్లు ఫ్రఫుల్‌ హింజ్‌, సకిబ్‌ హుస్సేన్‌కు నా అభినందనలు. వారు చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రేక్షకుల ఒత్తిడి ఉన్నప్పటికీ, మొదటి నాలుగు–ఐదు ఓవర్లలో చాలా బాగా బౌలింగ్‌ చేశారు. నేను వారిని ఎక్కువగా చూడలేదు. కానీ ఈ ప్రదర్శన అద్భుతం.  

జడేజాకు బౌలింగ్‌ ఇవ్వకపోవడం  
అప్పటికి ఇషాన్‌ బాగా ఆడుతున్నాడు. జడ్డూ భాయ్‌కి బౌలింగ్‌ ఇవ్వకపోవడానికి కారణాలు లేవు. బిష్ణోయిని నమ్మాను. వారు మేము అనుకున్న దానికంటే 30 పరుగులు ఎక్కువ చేశారు. ఈ ఓటమిని ఇక్కడితో వదిలిపెట్టి, తదుపరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతాం.  

మొత్తంగా రియాన్‌ మాటలను బట్టి చూస్తే.. ఈ ఓటమిని లైట్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement