ఆటగాడి క్యాచ్‌కు అభిమానులు ఫిదా; నీ తెలివి సూపర్‌

Cricketer Fabian Allen Fantastic Catch Goes Viral Vs Australia T20 - Sakshi

సెంట్‌ లూసియా: విండీస్‌ బౌలర్‌ ఫాబియన్‌ అలెన్‌ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ క్యాచ్‌తో అలరించాడు. ముందు బౌలింగ్‌లో కీలకమైన మిచెల్‌ మార్ష్‌ వికెట్‌ తీసిన అతను ఆ తర్వాత రెండు క్యాచ్‌లతో మెరిశాడు. అందులో ఒకటి బౌండరీ లైన్‌ వద్ద మరొక ఆటగాడిని సమన్వయం చేసుకుంటూ అలెన్‌ అందుకున్న క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో హెడెన్‌ వాల్స్‌ వేసిన ఐదో బంతిని కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అది సిక్స్‌ అని అంతా భావిస్తున్న తరుణంలో లాంగాన్‌.. అటు మిడ్‌ వికెట్‌ నుంచి బ్రేవో, అలెన్‌లు పరిగెత్తుకొచ్చారు.

అయితే బ్రేవో అప్పటికే బంతిని ఒడిసిపట్టే ప్రయత్నం చేయగా.. అతని చేతుల నుంచి జారింది. ఇంతలో సమయస్పూర్తితో వ్యవహరించిన అలెన్‌ బంతికి కాస్త దూరంలో ఉన్నా తన కాళ్లను స్ట్రెచ్‌ చేస్తూ అందుకున్నాడు. అంతే ఫామ్‌లో ఉన్న ఫించ్‌ పెవిలియన్‌కు చేరగా.. విండీస్‌ క్రికెటర్లు సంబరాల్లో మునిగి తేలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఈ మ్యాచ్‌లో హార్డ్‌ హిట్టర్‌ గేల్‌ సునామీతో విండీస్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.142 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. గేల్‌(38 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడడంతో పాటు కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (32, 27 బంతులు; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) సహకరించాడు. దీంతో విండీస్‌ 14.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా విండీస్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటింగ్‌లో హెన్రిక్స్‌ 33, కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 30 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో షెల్డన్‌ కాట్రెల్‌ 3, ఆండీ రసెల్‌ 2 వికెట్లు తీశారు. ఇక గేల్‌ ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 14వేల పరుగులు అందుకున్న తొలి ఆటగాడిగా గేల్‌ చరిత్ర సృష్టించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top