‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’ | Cricket Fans Slams Tim David Should Punish Worst Behaviour With Umpires | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’

Apr 13 2026 6:00 PM | Updated on Apr 13 2026 6:48 PM

Cricket Fans Slams Tim David Should Punish Worst Behaviour With Umpires

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) బ్యాట‌ర్ టిమ్ డేవిడ్ చేసిన ఒక ప‌ని చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విష‌యంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. అయితే డేవిడ్ బ‌లంగా బాద‌డంతో బంతి ఆకారం మారిపోయింది. 

దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయ‌డం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాల‌ని ప‌దే ప‌దే అడిగిన‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ అత‌డిని ప‌ట్టించుకోకుండా అదే ప‌నిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. 

లెగ్ అంపైర్ వీరేంద‌ర్ శ‌ర్మ వ‌చ్చి ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని వార్నింగ్ ఇవ్వ‌డం, ఇంత‌లో ముంబై ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఇదంతా ఫ‌న్నీ మోడ్‌లోనే చేసిన‌ప్ప‌టికీ చూసేవాళ్ల‌కు మాత్రం అత‌డి ప్ర‌వ‌ర్త‌న విసుగు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

వీడియో చూసిన అభిమానులు టిమ్ డేవిడ్‌ను ఏకిపారేశారు. ‘అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ అయ్యుండి ఒక ఫీల్డ్ అంపైర్‌కు ఇచ్చే మ‌ర్యాద ఇదేనా?’ అంటూ ఒక అభిమాని ప్ర‌శ్నించాడు. ‘అందుకే క్రికెట్‌లో యెల్లో, రెడ్ కార్డులు ప్ర‌వేశ‌పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంది’ అని మ‌రొక అభిమాని కామెంట్ చేశాడు. ‘ఇలాంటి చిల్ల‌ర చేష్ట‌లు చేయ‌కుండా డీమెరిట్ పాయింట్ లేదా మ్యాచ్ నిషేధం విధిస్తే దారికొస్తాడ‌ని’ మ‌రికొంత‌మంది కామెంట్ చేశారు.  

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ఆర్సీబీ 18 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్‌పై విజ‌యం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్‌, ప‌టిదార్‌లు అర్థ‌సెంచ‌రీల‌తో మెరిశారు. అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.

చదవండి: ఈ లెక్క‌న ఎస్ఆర్‌హెచ్‌కు మూడిన‌ట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement