సంజూ ఎందుకు?.. అతడిని ఇంకెప్పుడు ఆడిస్తారు? | IND vs OMAN: Sanju Samson Shines as India Secures Hat-trick Win in Asia Cup 2025 | Sakshi
Sakshi News home page

వికెట్‌ కీపర్‌గా సంజూ ఎందుకు?.. అతడిని ఇంకెప్పుడు ఆడిస్తారు?

Sep 20 2025 3:04 PM | Updated on Sep 20 2025 3:29 PM

Could have played Jitesh: Aakash chopra on Suryakumar Not Bat Vs OMAN

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. లీగ్‌ దశలో తొలుత యూఏఈ, పాకిస్తాన్‌లను ఓడించిన సూర్యకుమార్‌ సేన.. శుక్రవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో ఒమన్‌పై 21 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా గ్రూప్‌-ఎ టాపర్‌గా కొనసాగుతూ సూపర్‌-4 దశను ఆదివారం మొదలుపెట్టనుంది.

ఓపెనర్లు మినహా
ఇదిలా ఉంటే.. ఒమన్‌తో మ్యాచ్‌లో టీమిండియా తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసింది. ఓపెనర్లు  అభిషేక్‌ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్‌మన్‌ గిల్‌(5) మినహా మిగతా వారి ఆర్డర్‌ను మార్చింది. 

వన్‌డౌన్లో సంజూ శాంసన్‌ (45 బంతుల్లో 56), నాలుగో నంబర్‌లో హార్దిక్‌ పాండ్యా (1).. ఆ తర్వాతి స్థానాల్లో అక్షర్‌ పటేల్‌ (13 బంతుల్లో 26), తిలక్‌ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్‌ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్‌), అర్ష్‌దీప్‌ సింగ్‌ (1), కుల్దీప్‌ యాదవ్‌ (1 నాటౌట్‌)లను ఆడించింది.

బ్యాటింగ్‌కు రాని సూర్య
ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) బ్యాటింగ్‌కు రానేరాలేదు. మరోవైపు.. గత రెండు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్‌ చేసే అవకాశమే పొందని వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson).. తాజాగా టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూకు బదులు జితేశ్‌ శర్మను వికెట్‌ కీపర్‌గా బరిలోకి దించాల్సిందని అభిప్రాయపడ్డాడు. లీగ్‌ దశలో అన్ని మ్యాచ్‌లు ముగిసినా జితేశ్‌కు అవకాశం రాలేదని.. అతడొక్కడినే వదిలేశారని పేర్కొన్నాడు.

వికెట్‌ కీపర్‌గా సంజూ ఎందుకు?
‘‘తిలక్‌ వర్మ మరీ లోయర్‌ ఆర్డర్‌లో వచ్చాడు. సూర్య అసలు బ్యాటింగ్‌కు రాలేదు. అలాంటపుడు జితేశ్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించాల్సింది కదా!.. జితేశ్‌ను ఆడిస్తారనే అనుకున్నా. ఇప్పటి వరకు.. అతడిని తప్ప అందరినీ ఆడించారు. వందకు వంద శాతం సూపర్‌ పవర్‌ హిట్టర్‌ను మాత్రం వదిలేశారు.

అతడికి ఒక అవకాశమైతే ఇవ్వాలి కదా
మిడిలార్డర్‌లో వికెట్‌ కీపర్‌ అవసరం ఉంటుంది. కానీ మీరు సంజూను ఆ స్థానంలో ఆడించాలని ఫిక్సయిపోయారు కాబట్టి జితేశ్‌ను పక్కనపెట్టారు. వికెట్‌ కీపర్‌ రేసులో ఉండాలన్న.. సంజూతో పోటీపడాలన్నా అతడికి ఒక అవకాశమైతే ఇవ్వాలి కదా!’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

సంజూ సూపర్‌
ఏదేమైనా ఒమన్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ.. అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడని ఆకాశ్‌ చోప్రా అభినందించాడు. ఆరంభంలో ఫాస్ట్‌బౌలర్ల కారణంగా కాస్త ఇబ్బందిపడినప్పటికీ.. తర్వాత పరుగులు రాబట్టాడని పేర్కొన్నాడు. వికెట్లు పడుతున్న వేళ విలువైన అర్ధ శతకంతో రాణించాడని ప్రశంసించాడు. కాగా తదుపరి సూపర్‌-4 దశలో తొలుత టీమిండియా ఆదివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇందుకు దుబాయ్‌ వేదిక.

చదవండి: IND vs OMAN: సూర్యకుమార్‌ అనూహ్య నిర్ణయం.. గావస్కర్‌ స్పందన ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement