
వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యంపై చిరాగ్ శెట్టి
పూర్తి ఫిట్‌గా మారాల్సి ఉందన్న షట్లర్
న్యూఢిల్లీ: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇటీవలే పారిస్‌లో భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ ఈవెంట్‌లో రెండోసారి కాంస్యం గెలిచిన ద్వయం... తద్వారా భారత్ తరఫున ఒకటికంటే ఎక్కువ పతకాలు సాధించిన ఆటగాళ్లుగా పీవీ సింధు (5), సైనా నెహ్వాల్ (2) సరసన నిలిచారు. ఇదే వేదికపై, ఇదే కోర్టులో గత ఏడాది ఒలింపిక్స్‌లో ఓటమిపాలై తీవ్ర నిరాశ చెందిన భారత జంట ఇప్పుడు అక్కడే మంచి విజయాన్ని అందుకుంది.
‘గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పరాజయం పాలైన చోటే వరల్డ్ చాంపియన్‌షిప్ పతకం గెలవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇది ఒక రకంగా మా పునరాగమనంలాంటిది. దీని వల్ల నాటి ఓటమి బాధ దూరమైంది. సింధు, సైనాలవంటి స్టార్ల జాబితాలో మా పేరు కూడా ఉండటం సంతోషంగా ఉంది. పైగా ఇటీవల మా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి సమయంలో ఈ పతకం గెలవడం ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది’ అని చిరాగ్ శెట్టి అన్నాడు.
సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడి చైనాకు చెందిన చెన్ బో యంగ్–ల్యూ యి చేతిలో ఓటమి పాలైంది. అయితే అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో వీరిద్దరు ఆరోన్ చియా–సో వూకీ (మలేసియా)పై సంచలన విజయం సాధించి కాంస్యాన్ని ఖాయం చేసుకున్నారు. ‘వరుసగా రెండు గేమ్‌లలో ఈ మ్యాచ్ గెలవడం మాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. ఆరోన్ ద్వయంపై గెలుపు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. పతకం సాధించడం మాత్రమే కాదు, మేం సరైన వ్యూహంతో ఆడితే ప్రపంచంలో ఎవరినైనా ఓడించగలమనే నమ్మకం వచ్చింది’ అని చిరాగ్ గర్వంగా చెప్పాడు.
‘డ్రా’ కఠినంగా ఉన్నా సరే, భారత షట్లర్లు అంచనాలకు తగినట్లుగా రాణించడం జట్టుగా సంతృప్తినిచి్చందన్న చిరాగ్... వరల్డ్ రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్‌సన్‌పై దాదాపు విజయానికి చేరువగా వచ్చి త్రుటిలో అవకాశం కోల్పోయిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. 2011 నుంచి భారత్ వరుసగా ఏదో ఒక పతకంతో తిరిగి రావడం సానుకూల విషయమని అతను పేర్కొన్నాడు. మున్ముందు మరిన్ని పెద్ద విజయాలు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్న చిరాగ్... ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఫిట్‌గా మారడంపై దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు.
‘గత కొంత కాలంగా మాకు కలిసి రాలేదు. అటు కోర్టులో, ఇటు కోర్టు బయట వ్యక్తిగతంగా కూడా సమస్యలు ఎదుర్కొన్నాం. 100 శాతం ట్రైనింగ్ కూడా చేయలేకపోయాం. అత్యుత్తమ ఫిట్‌నెస్ అందుకోవాలని మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత వచ్చే టోర్నీల్లో కనీసం ఫైనల్ చేరి ఆపై టైటిల్ సాధించడం ముఖ్యం. ఈ ఏడాదికి సంబంధించి బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్‌పై మా దృష్టి ఉంది. ఇప్పుడు సరైన దిశలోనే వెళుతున్నామని భావిస్తున్నాం’ అని చిరాగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.