చెన్నై గెలుపు చమక్‌ | Chennai Super Kings beat Kolkata Knight Riders by 32 runs | Sakshi
Sakshi News home page

చెన్నై గెలుపు చమక్‌

Apr 15 2026 5:00 AM | Updated on Apr 15 2026 5:00 AM

Chennai Super Kings beat Kolkata Knight Riders by 32 runs

వరుసగా రెండో మ్యాచ్‌ నెగ్గిన సీఎస్‌కే

32 పరుగులతో కోల్‌కతా ఓటమి

ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌దే పైచేయి అయింది. సొంతగడ్డ చెపాక్‌లో అసాధారణ ప్రదర్శన లేకపోయినా... ప్రత్యర్థితో పోలిస్తే మెరుగైన ఆటతీరు కనబర్చిన సీఎస్‌కే మరో రెండు పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. సామ్సన్, బ్రెవిస్‌ తమ బ్యాటింగ్‌తో చెప్పుకోదగ్గ స్కోరును అందించగా, బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్‌ మూడు వికెట్లతో జట్టు విజయానికి బాటలు వేశాడు. మరోవైపు కోల్‌కతా ప్రతీ మ్యాచ్‌కు దిగజారుతున్న ఆటతో అట్టడుగున తాము నిలిచిన స్థానాన్ని మరింత స్థిరపర్చుకున్నట్లయింది. అన్ని రంగాల్లో విఫలమైన మాజీ చాంపియన్‌ ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా ఒక్కటీ గెలవలేక చతికిలపడింది.  

చెన్నై: వరుసగా మూడు ఓటముల తర్వాత కోలుకొని గత మ్యాచ్‌లో గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పుడు ఐపీఎల్‌ 19వ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో చెన్నై 32 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజు సామ్సన్‌ (32 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రెవిస్‌ (29 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్‌ మాత్రే (17 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నూర్‌ అహ్మద్‌ (3/21) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు.  

కెప్టెన్‌ మళ్లీ విఫలం... 
అరోరా వేసిన ఇన్నింగ్స్‌ తొలి మూడు బంతులను ఫోర్లుగా మలచి సామ్సన్‌ శుభారంభం అందించగా, మరోవైపు కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (7) వైఫల్యం కొనసాగింది. ఆ తర్వాత గ్రీన్‌ ఓవర్లో మాత్రే చెలరేగిపోయాడు. రెండో బంతికి ఫోర్‌ కొట్టిన అతను, చివరి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6, బాదాడు. అరోరా ఓవర్లో కూడా తొలి మూడు 
బంతుల్లో వరుసగా ఫోర్లు కొట్టిన మాత్రే అదే ఓవర్‌ చివరి బంతికి వెనుదిరిగాడు.

పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 72/2కు చేరింది. ఈ దశలో సామ్సన్, బ్రెవిస్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే త్యాగి బౌలింగ్‌లో అద్భుత సిక్స్‌ కొట్టిన సామ్సన్‌ 148.1 కిలోమీటర్ల వేగంతో దూసుకొచి్చన తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. అనంతరం వరుణ్, అరోరా ఓవర్లలో కలిపి సర్ఫరాజ్‌ ఖాన్‌ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బ్రెవిస్‌ 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35 పరుగులు రాబట్టడంతో జట్టు కోలుకుంది. అయితే వీరిద్దరు 9 పరుగుల వ్యవధిలో అవుట్‌ కాగా... సీఎస్‌కే చివరి 4 ఓవర్లలో కేవలం 3 ఫోర్లతో 30 పరుగులు మాత్రమే సాధించగలిగింది!  

టపటపా... 
ఛేదనలో కోల్‌కతా పూర్తిగా తడబడింది. ఫిన్‌ అలెన్‌ (1) మళ్లీ విఫలం కాగా, సునీల్‌ నరైన్‌ (17 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పవర్‌ప్లేలో కేకేఆర్‌ 36 పరుగులు మాత్రమే సాధించింది. ప్రత్యర్థి పవర్‌ప్లేతో పోలిస్తే ఇవి సగం పరుగులు మాత్రమే! ఇక్కడే జట్టు విజయావకాశాలకు దెబ్బ పడింది. ఆ తర్వాత కూడా టీమ్‌ ఏమాత్రం కోలుకోలేకపోయింది. నూర్‌ వరుస బంతుల్లో రహానే (22 బంతుల్లో 28; 2 సిక్స్‌లు), గ్రీన్‌ (0)లను అవుట్‌ చేశాడు. నూర్‌ తర్వాతి ఓవర్లో రింకూ సింగ్‌ (6) కూడా డగౌట్‌ చేరడంతో కోల్‌కతా గెలుపు ఆశలు ముగిసిపోయాయి.   

స్కోరు వివరాలు  
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (బి) త్యాగి 48; రుతురాజ్‌ (సి) పావెల్‌ (బి) రాయ్‌ 7; మాత్రే (సి) రమణ్‌దీప్‌ (బి) అరోరా 38; బ్రెవిస్‌ (సి) అరోరా (బి) త్యాగి 41; సర్ఫరాజ్‌ (బి) నరైన్‌ 23; దూబే (నాటౌట్‌) 13; ఒవర్టన్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–25, 2–72, 3–111, 4–162, 5–171. బౌలింగ్‌: అరోరా 4–0–55–1, గ్రీన్‌ 2–0– 30–0, అనుకూల్‌  3–0–21–1, నరైన్‌ 4–0–21–1, వరుణ్‌ 3–0–26–0, త్యాగి 4–0–35–2.  కోల్‌కతా

నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (సి) దూబే (బి) కంబోజ్‌ 1; నరైన్‌ (సి) గుర్‌జప్‌నీత్‌ (బి) ఖలీల్‌ 24; రహానే (సి) రుతురాజ్‌ (బి) నూర్‌ 28; రఘువంశీ (సి) బ్రెవిస్‌ (బి) హొసీన్‌ 27; రింకూ (సి) దూబే (బి) నూర్‌ 6; గ్రీన్‌ (బి) నూర్‌ 0; పావెల్‌ (నాటౌట్‌) 31; రమణ్‌దీప్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) కంబోజ్‌ 35; రాయ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–13, 2–29, 3–79, 4–85, 5–85, 6–90, 7–153. బౌలింగ్‌: ఖలీల్‌ 3.5–0–24–1, కంబోజ్‌ 4–0– 32–2, హొసీన్‌ 4–0–26–1, నూర్‌ 4–0– 21–3, గుర్‌జప్‌నీత్‌ 1.1–0–23–0, ఒవర్టన్‌ 3–0–32–0.  

Advertisement
 
Advertisement
Advertisement