
148 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో కెనడా జట్టు అత్యంత చెత్త రికార్డును మూట కట్టకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయిన మొదటి జట్టుగా కెనడా నిలిచింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా ఇటీవలే కెనడా, స్కాట్లాండ్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత కెనడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కెనడాకు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. తొలి బంతికే కెనడా ఓపెనర్ అలీ నదీమ్‌ను స్కాటిష్ పేసర్ బ్రాడ్ క్యూరీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి పర్గత్ సింగ్ వచ్చాడు.
అయితే ఇక్కడే అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. రెండో బంతిని పర్గత్ సింగ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. కానీ దురదృష్టవశాత్తూ బంతి బౌలర్ చేతి వేలు తాకుతూ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో బెయిల్స్‌ను గిరాటేసింది. దీంతో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా రనౌటయ్యాడు. యువరాజ్ కనీసం ఒక్క బంతి కూడా ఆడకుండా డైమండ్ డక్‌గా పెవిలియన్ చేరాల్సింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఓవర్‌లోనే ఇలా వరుస బంతుల్లో ఓపెనర్లు ఔట్ కావడం ఇదే మొదటి సారి.
స్కాట్లాండ్ ఘన విజయం..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 48.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. కెనడా బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయాస్ మొవ్వ(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జస్కరన్ సింగ్(32) పరుగులతో రాణించారు. స్కాట్లాండ్ బౌలర్ క్యూరీ నాలుగు వికెట్లు పడగొట్టి కెనడా పతనాన్ని శాసించాడు.
అతడితో పాటు బ్రాండన్ మెక్‌ముల్లెన్ రెండు.. వాట్, షరీఫ్ తలా వికెట్లు సాధించారు. అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని స్కాట్లాండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 41.5 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ మున్సీ(84 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.
చదవండి: సెంచరీతో చెలరేగిన స్టార్ ప్లేయర్.. టీమిండియా అరంగేట్రం ఖాయం!?