
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ (Bangladesh) పులులు గర్జించాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాయి. ఢాకా వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన సిరీస్ డిసైడర్‌లో ఆతిథ్య జట్టు 179 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగారు. వీరి గర్జనకు మాజీ ప్రపంచ ఛాంపియన్లు బిత్తరపోయారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్ చేసిన బంగ్లాదేశ్.. బౌలింగ్‌లో ప్రత్యర్దిని ఉక్కిరిబిక్కిరి చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగి విండీస్ బ్యాటర్ల భరతం పట్టారు.
ఈ సిరీస్‌లోని తొలి వన్డేలోనూ బంగ్లాదేశ్ బౌలర్లు ఇదే రీతిలో చెలరేగిపోయారు. ఆ మ్యాచ్‌లో స్వల్ప స్కోర్ చేసినా విండీస్‌ను ఇంకా తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. రెండో వన్డేలోనూ ఇదే ప్రదర్శనను కొనసాగించారు. అయితే ఈసారి విండీస్ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్‌లో విండీస్ గెలుపొందింది.
మూడో వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్ (80), సౌమ్య సర్కార్ (91) సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన తౌహిద్ హృదోయ్ (28), నజ్ముల్ హసన్ షాంటో (44) కూడా పర్వాలేదనిపించారు.
అయితే ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా రాణించకపోవడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓ దశలో సునాయాసంగా 350 పరుగులు చేస్తుందనుకున్న జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా 300లోపే పరిమితమైంది.
తొలుత తడబడిన విండీస్ బౌలర్లు ఆఖర్లో అనూహ్యంగా పుంజుకొని బంగ్లాను 300లోపే కట్టడి చేశారు. అకీల్ హోసేన్ 4, అలిక్ అథనాజ్ 2, రోస్టన్ ఛేజ్, మోటీ తలో వికెట్ తీసి, బంగ్లాను భారీ స్కోర్ చేయకుండా నియంత్రించారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చిన ఆ జట్టు 30.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్, రిషద్ హొసేన్ తలో 3, మెహిది హసన్, తన్వీర్ ఇస్లాం చెరో 2 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.
కాగా, ఇరు జట్ల ఈ నెల 27 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 27, 29, 31 తేదీల్లో చట్టోగ్రామ్ వేదికగా జరుగుతుంది.
చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్ సెంచరీ