SA vs BAN: భారత్‌ పేరిట ఉన్న చెత్త రికార్డు బంగ్లాకు బదిలీ.. ప్రొటీస్‌ అద్భుత విజయం

Bangladesh 2nd Lowest Score Ever Tests South Africa Won After 9 Years - Sakshi

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయాన్ని నమోదు చేసింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 54 పరుగులకే ఆలౌటై 220 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేశవ్‌ మహరాజ్‌(10-0-32-7) బౌలింగ్‌ దాటికి విలవిల్లాలాడిన బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు మాత్రమే డబుల్‌ డిజిట్‌ మార్క్‌ను సాధించగా.. మిగతా తొమ్మిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో నలుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌ కావడం విశేషం. 

కాగా రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ అన్ని వికెట్లను ఇద్దరు బౌలర్లు మాత్రమే పడగొట్టడం విశేషం. కేశవ్‌ మహరాజ్‌ ఏడు వికెట్లు తీయగా.. సిమోన్‌ హార్మర్‌ మిగతా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకో విశేషమేమిటంటే రెండో ఇన్నింగ్స్‌ ఆడిన బంగ్లాదేశ్‌కు బౌలింగ్‌ కూడా ఈ ఇద్దరే వేశారు. ఒక ఇన్నింగ్స్ మొత్తం ఓవర్లు ఇద్దరు బౌలర్లే వేయడం సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌ ప్రొటీస్‌ గడ్డపై చెత్త రికార్డు నమోదు చేసింది. కింగ్స్‌మీడ్‌ మైదానంలో(డర్బన్‌) టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా బంగ్లాదేశ్‌ నిలిచింది.  

ఇంతకముందు ఈ చెత్త రికార్డు టీమిండియా పేరిట ఉంది. 1996-97 డర్బన్‌ టెస్టులో టీమిండియా 66 పరుగులకే ఆలౌటైంది. తాజాగా ఈ రికార్డు బంగ్లాదేశ్‌కు బదిలీ అయింది. బంగ్లాకు టెస్టుల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకముందు 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో బంగ్లాదేశ్‌ 43 పరుగులకే ఆలౌట్‌ అయి చెత్త రికార్డు మూటగట్టుకుంది. కాగా దక్షిణాఫ్రికా డర్బన్‌ వేదికగా 2013 తర్వాత మళ్లీ విజయాన్ని అందుకుంది. ఈ 9 ఏళ్లలో జరిగిన 10 టెస్టుల్లో ఒక్కదాంట్లో కూడా సౌతాఫ్రికా విజయం సాధించకపోవడం విశేషం. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో సౌతాఫ్రికా ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఏప్రిల్‌ 8 నుంచి 12 వరకు పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా జరగనుంది.

చదవండి: World Cup 2022: భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!

సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన స్టార్‌ క్రికెటర్‌.. భావోద్వేగానికి లోనవుతూ..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top