Ross Taylor Retirement: సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన స్టార్‌ క్రికెటర్‌.. భావోద్వేగానికి లోనవుతూ..!

Ross Taylor Bids Emotional Goodbye To Cricket - Sakshi

Ross Taylor Bids Emotional Goodbye To Cricket: న్యూజిలాండ్ క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు జట్టుకు సేవలందించిన స్టార్‌ ఆటగాడు రాస్ టేలర్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 16 బంతుల్లో ఒక సిక్సర్‌ సాయంతో 14 పరుగులు చేసి ఔటైన రోస్కో (రాస్‌ టేలర్‌ ముద్దు పేరు).. కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేశాడు. 


ఆఖరి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన టేలర్‌కు నెదర్లాండ్స్ ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో స్వాగతం పలికారు. మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన టేలర్‌.. ఉబికి వస్తున్న దుఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. 

2006లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన 38 ఏళ్ల  రాస్ టేలర్.. న్యూజిలాండ్ తరుపున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్‌ల్లో 44.16 సగటున 3 డబుల్‌ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీల సాయంతో 7684 పరుగులు చేసిన టేలర్.. వన్డేల్లో 47.52 సగటుతో 21 సెంచరీలు, 51 హాఫ్‌ సెంచరీల సాయంతో  8602 పరుగులు చేశాడు. టేలర్.. టీ20ల్లో 7 హాఫ్ సెంచరీల సాయంతో 1909 పరుగులు సాధించాడు. టేలర్‌ జాతీయ జట్టు తరఫునే కాకుండా ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 55 మ్యాచ్‌ల్లో 3 హాఫ్‌ సెంచరీల సహకారంతో 1017 పరుగులు స్కోర్‌ చేశాడు. 


ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మార్టిన్ గప్టిల్ (123 బంతుల్లో 106; 11 ఫోర్లు,  2 సిక్సర్లు),  విల్ యంగ్ (112 బంతుల్లో 120; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. ఛేదనలో నెదర్లాండ్స్‌ 25 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కాగా, తొలి రెండు వన్డేల్లోనూ గెలుపొందిన కివీస్‌.. 2-0తేడాతో సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. స్టార్‌ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడేందుకు భారత్‌కు వెళ్లడంతో న్యూజిలాండ్‌ ఈ సిరీస్‌కు బీ టీమ్‌తో బరిలోకి దిగింది.

చదవండి: IPL 2022: 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top