
అత్యంత పటిష్టంగా టీమిండియా
నేటి నుంచి ఆసియా కప్ టి20 టోర్నీ
సెప్టెంబర్ 28న ఫైనల్
తొలి పోరులో అఫ్గానిస్తాన్‌తో హాంకాంగ్ ‘ఢీ’
రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
వన్డే, టి20 ఫార్మాట్‌లు కలిపి ఇప్పటి వరకు ఆసియా కప్ 16 సార్లు జరిగింది. వీటిలో 8 సార్లు విజేతగా నిలిచిన భారత్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫార్మాట్ ఏదైనా ఇప్పుడు టీమిండియా ఫామ్ చూస్తే ఎదురులేని జట్టుగా కనిపిస్తోంది. విధ్వంసకర బ్యాటర్లు, పదునైన బౌలర్లతో నిండిన సూర్యకుమార్ బృందం టైటిల్ గెలవకపోతేనే ఆశ్చర్యపోవచ్చు! ఎనిమిది దేశాల ఈ టోర్నీలో భారత్‌కు మిగతా జట్లు ఎంత వరకు పోటీనిస్తాయనేది సందేహమే. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత క్రికెట్ అభిమానులకు కొత్త సీజన్‌లో మళ్లీ పూర్తి వినోదానికి ఆసియా కప్‌తో తెర లేస్తోంది.
దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన సరిగ్గా ఆరు నెలల తర్వాత ఎడారి దేశంలో మరో పెద్ద టోర్నీకి రంగం సిద్ధమైంది. ఎనిమిది టీమ్‌లు పాల్గొంటున్న ఆసియా కప్ టి20 టోర్నీ నేడు మొదలవుతోంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో హాంకాంగ్ ‘ఢీ’కొంటుండగా... భారత్ తమ తొలి మ్యాచ్‌లో బుధవారం ఆతిథ్య యూఏఈతో తలపడుతుంది. నిజానికి ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సింది. అయితే పాకిస్తాన్ మన దేశంలో ఆడే అవకాశం లేదని తేలడంతో తటస్థ వేదికకు మార్చారు.
దుబాయ్, అబుదాబిలలో మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా... ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐ చేతుల్లోనే ఉన్నాయి. 2023లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. సిరాజ్ (6/51) ధాటికి శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలగా, భారత్ 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. వచ్చే ఏడాది ఆరంభంలో టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఫార్మాట్‌ను టి20కి మార్చారు. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
రెండు గ్రూపులుగా...
ఆసియా కప్‌లో ఎనిమిది జట్లు ఆడటం ఇదే మొదటిసారి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా అర్హత సాధించగా... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ పేరుతో నిర్వహించిన టోర్నీలో టాప్–3లో నిలిచిన యూఏఈ, ఒమన్, హాంకాంగ్ టోర్నీకి అర్హత పొందాయి.
గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉండగా... గ్రూప్ ‘బి’లో అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని మిగతా మూడు జట్లతో తలపడుతుంది. ప్రతీ గ్రూప్‌లోని టాప్–2 టీమ్‌లు సూపర్–4కు అర్హత సాధిస్తాయి. ఇక్కడా మిగతా మూడు జట్లతో ఆడిన తర్వాత టాప్–2 ఫైనల్ చేరతాయి.
అంతా ఆ మ్యాచ్ కోసమే...
పహల్గాం ఉగ్రదాడి తర్వాతి పరిణామాలను బట్టి చూస్తే భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగడం అసాధ్యంగా అనిపించింది. అయితే చివరకు భారత ప్రభుత్వం పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియాకు అనుమతి ఇచ్చింది. బలాబలాలపరంగా ఇరు జట్ల మధ్య ఆకాశమంత వ్యత్యాసం ఉన్నా...ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ పోరుపై ఆసక్తి పెరిగింది.
భారత్, పాక్ గ్రూప్ దశలో ఈ నెల 14న (ఆదివారం) తలపడతాయి. సంచలన ఫలితాలు లేకపోతే ఇరు జట్ల మధ్య టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు (ఫైనల్ సహా) జరిగే అవకాశం కూడా ఉంది. దాయాది దేశాల మధ్య గతంలో ఎప్పుడూ ఆసియా కప్ ఫైనల్ జరగలేదు!
కొత్త కుర్రాళ్లతో...
భారత్‌తో పోలిస్తే బలహీనంగా ఉన్నా... ఇతర టీమ్‌లు కొన్ని అనూహ్య ఫలితాలను ఆశిస్తున్నాయి. పైగా కొందరు ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా టోర్నీలో కీలకం కానుంది. బాబర్, రిజ్వాన్‌లను తప్పించిన పాకిస్తాన్ జట్టు సల్మాన్ ఆఘా సారథ్యంలో కొత్తగా కనిపిస్తోంది. ముక్కోణపు టోర్నీని గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బంగ్లా ఇటీవలే లంకపై సిరీస్ విజయం సాధించింది.
ఒమన్‌కు ముంబై మాజీ క్రికెటర్ సులక్షణ్ కులకర్ణి కోచ్‌గా వ్యవహరిస్తుండగా, హాంకాంగ్, యూఏఈ జట్లు తమ కెపె్టన్లు ముర్తజా, వసీమ్‌లపై ఆధారపడుతున్నాయి. పాక్ లెఫ్టార్మ్ పేసర్ సల్మాన్ మీర్జా, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ఘజన్‌ఫర్ కొత్తగా చూడదగ్గ ఆటగాళ్లు.