
భారత్-పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో మరోసారి యుద్దానికి సిద్దమయ్యాయి. ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. చివరగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ముఖాముఖి తలపడిన భారత్-పాక్.. ఇప్పుడు మళ్లీ ఆరు నెలల తర్వాత అభిమానులను ఉరూత్రలూగించనున్నాయి.
ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటికే అద్బుతమైన విజయంతో శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఇప్పుడు అదే మైదానంలో పాక్ ఒమన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. పసికూన ఒమన్‌ను చిత్తు చేసి టోర్నీలో శుభారంభం చేయాలని పాక్ కూడా యోచిస్తోంది.
పాకిస్తాన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ట్రైసిరీస్ విజయంతో ఈ టోర్నీలో అడుగుపెట్టింది. అయితే బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు లేకపోయినప్పటికి చాలా మంది యంగ్ టాలెంటడ్ ఆటగాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.
పాకిస్తాన్ జట్టు ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. తమదైన రోజున వరల్డ్ నెం1 జట్టును ఓడించగలిగే పాకిస్తాన్.. కొన్నిసార్లు జింబాబ్వే, అఫ్గాన్ వంటి పసికూన చేతిలో సైతం ఘోర పరాజయాల పాలై విమర్శకులకు దొరకిపోతుంటుంది. అయితే పాక్ జట్టు ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పటిష్టం కన్పిస్తోంది.

జమాన్‌తో జాగ్రత్త..
ఫఖర్ జమాన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం మెన్ ఇన్ గ్రీన్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. జమాన్‌కు భారత్‌పై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017ను పాక్ సొంత చేసుకోడంలో జమాన్‌ది కీలక పాత్ర.
భారత్‌తో జరిగిన ఫైనల్లో అతడు అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. టీమిండియాపై టీ20ల్లో అతడు పెద్దగా రన్స్ సాధించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం కేవలం 6 మ్యాచ్‌లు ఆడి 234 పరుగులు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ పాక్‌కు మరోసారి కీలకం కానున్నాడు.

వారిద్దరూ చాలా డేంజరస్..
అతడితో పాటు యువ ఆటగాళ్లు సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్‌ల నుంచి భారత బౌలర్లకు గట్టి పోటీ ఎదురు కానుంది. టీ20ల్లో పాక్ కొత్త ఓపెనింగ్ జోడీ అయినా ఫర్హాన్, సైమ్‌లు.. ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ యూఏఈ ట్రైసిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటికి.. విధ్వంసకర బ్యాటింగ్ చేసే సత్తా వీరికి ఉంది.
ఫర్హాన్‌కు టీ20ల్లో145కు పైగా స్ట్రైక్ రేట్ ఉంది. అయూబ్ అయితే తన అరంగేట్రం నుంచి బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తూ వస్తున్నాడు. ఇక మిడిలార్డర్‌లో కెప్టెన్ సల్మాన్ అఘా.. నిలకడకు పెట్టింది పేరు. అతడు పరిస్థితిని బట్టి తన బ్యాటింగ్ గేర్లను మారుస్తూ ఉంటాడు.
అతడితో కొత్త ఆటగాడు హసన్ నవాజ్ సైతం మెరుపులు మెరిపించలడు. నవాజ్ న్యూజిలాండ్‌పై 44 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్రకెక్కాడు. హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా వంటి వెటరన్లు ఉన్నారు. అయితే వికెట్ కీపర్ మహ్మద్ హరిస్ ఫామ్‌లో లేకపోవడం పాక్ మెనెజ్‌మెంట్‌ను కాస్త కలవరపెడుతోంది.

ఆ నలుగురు..
ఇక ఆసియా ఉపఖండ పిచ్‌లలపై ప్రధాన ఆయుధం స్పిన్ బౌలింగ్. ఈ విభాగంలో పాక్ చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ నుంచి భారత బ్యాటర్లకు సవాలు ఎదురు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2005లో గిల్‌ను అబ్రార్ ఔట్ చేసిన విధానం ఇప్పటికి గుర్తుండే ఉంటుంది. ఈ లెగ్ స్పిన్నర్ అద్బుతమైన బంతితో గిల్‌ను బోల్తా కొట్టించాడు. వీరిద్దరితో పాటు ఖుష్దిల్ షా, సుఫియాన్ ముకీమ్ బంతిని గింగిరాలు తిరిగేలా చేయగలరు.
పేస్ బ్యాటరీ పవర్ ఫుల్..
ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీలు వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. వీరందరికి బంతిని స్వింగ్, రివర్స్ స్వింగ్ చేయడం వెన్నతో పెట్టిన విధ్య. ముఖ్యంగా దుబాయ్ పిచ్‌లపై ఆడిన అనుభవం మనకంటే వారికే ఎక్కువగా ఉంది.
ఆ కండీషన్స్ ఉపయోగించుకుని ఈ పేస్ త్రయం చెలరేగితే భారత బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అఫ్రిదికి భారత్‌పై మంచి రికార్డు ఉంది. అయితే ఎన్ని బలాలు ఉన్న పాక్‌కు బలహీనతలు కూడా ఉన్నాయి. బ్యాటింగ్‌లో స్ధిరత్వం లేకపోవడం పాక్ ప్రధాన బలహీనతగా ఉంది.
టాప్ ఆర్డర్ మీద ఆధారపడటం ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది. అదేవిధంగా ఫీల్డింగ్‌లో కూడా పాక్ పేలవ ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది. చాలా మ్యాచ్‌ల్లో కాచులు డ్రాప్, రన్ అవుట్స్ మిస్ చేయడం చేస్తూ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. కాగా ఆసియాకప్‌లో పాక్‌పై టీమిండియానే ఇప్పటివరకు పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ జట్టు:
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ షా ఆఫ్రిది, సుఫియాన్ ముఖీమ్