అంపైర్‌పైకి బంతిని విసిరిన పాక్‌ ఫీల్డర్‌.. తర్వాత ఏమైందంటే? | Asia Cup 2025, Pakistan Fielder Hits Umpire On Head Vs UAE What Happen Next, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: అంపైర్‌పైకి పాక్‌ ఫీల్డర్‌ త్రో.. బలంగా తాకిన బంతి.. తర్వాత ఏమైందంటే?

Sep 18 2025 12:03 PM | Updated on Sep 18 2025 12:35 PM

Asia Cup 2025: Pak Fielder Hits Umpire On Head Vs UAE What Happen Next

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు- మ్యాచ్‌ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్‌హ్యాండ్‌’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్‌.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(UAE)తో మ్యాచ్‌ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్‌ అంపైర్‌ను గాయపరిచింది.

ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్‌ ఫీల్డర్‌ చేసిన పని కారణంగా సదరు అంపైర్‌ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్‌ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ పరాశర్‌ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్‌ ఆయుబ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.

అంపైర్‌పైకి పాక్‌ ఫీల్డర్‌ త్రో.. బలంగా తాకిన బంతి
ఓవర్‌ ఐదో బంతిని థర్డ్‌మ్యాన్‌ రీజర్‌ దిశగా తరలించిన పరాశర్‌.. సింగిల్‌ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్‌ బంతిని అందుకుని నాన్‌-స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్‌ అంపైర్‌ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్‌ ఆయుబ్‌ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.

తర్వాత ఏమైందంటే?
అదే విధంగా పాక్‌ ఫిజియో వచ్చి అంపైర్‌కు కంకషన్‌ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్‌ అంపైర్‌ గాజీ సోహెల్‌ (బంగ్లాదేశ్‌) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. 

 

ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు
కాగా భారత ఆటగాళ్లు ‘షేక్‌ హ్యాండ్‌’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్‌ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్‌ బరిలోకి దిగింది.

భారత క్రికెటర్లు తమతో  కరచాలనం చేయకుండా మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ నిలువరించారని, ఆయనను ఆసియా కప్‌ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్‌ ఆడిన మ్యాచ్‌కు కూడా పైక్రాఫ్ట్‌నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.

‘క్షమాపణ’ చెప్పారంటూ...
ఈ మ్యాచ్‌ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్‌ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్‌లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్‌ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్‌ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.

ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్‌ జట్టు.. సూపర్‌-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్‌లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్‌-ఎ టేబుల్‌ టాపర్‌గా టీమిండియా ముందుగానే సూపర్‌-4కు చేరగా.. పాక్‌ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్‌ ఎలిమినేట్‌ అయ్యాయి.  

చదవండి: Asia Cup 2025: మ‌ళ్లీ భార‌త్-పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement