
అబుదాబి: అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు తగిన ప్రదర్శనతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. మంగళవారం మొదలైన ఈ టి20 టోర్నీ గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగా... ఆ తర్వాత హాంకాంగ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులే చేయగలిగింది.
అఫ్గాన్ భారీ స్కోరులో ఓపెనర్ సాదిఖుల్లా అటల్ (52 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (21 బంతుల్లో 53; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా అజ్మతుల్లా 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని అఫ్గాన్ తరఫున ‘ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ’ని నమోదు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 35 బంతుల్లోనే 82 పరుగులు జోడించడం విశేషం. సీనియర్ ఆటగాడు మొహమ్మద్ నబీ (26 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక పరుగులతో రాణించగా...
రహ్మనుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1), గుల్బదిన్ నైబ్ (5) విఫలమయ్యారు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా, ఆయుశ్ శుక్లా చెరో 2 వికెట్లు పడగొట్టాడు. హాంకాంగ్ ఫీల్డింగ్ వైఫల్యం కూడా అఫ్గాన్ టీమ్‌కు కలిసొచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు ఏకంగా నాలుగు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. సాదిఖుల్లాకు 4, 45, 51 పరుగుల వద్ద లైఫ్ లభించగా...అజ్మతుల్లా 22 పరుగుల వద్ద బతికిపోయి ఆ తర్వాత మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు.
కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ పూర్తిగా తడబడింది. మొత్తం జట్టులో బాబర్ హయత్ (43 బంతుల్లో 39; 3 సిక్స్‌లు), ముర్తజా (16) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 9.5 ఓవర్ల వద్దే 43/5 వద్ద నిలిచిన జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. హాంకాంగ్ తమ తర్వాతి మ్యాచ్‌లో 11న బంగ్లాదేశ్‌తో... అఫ్గానిస్తాన్ తమ తర్వాతి మ్యాచ్‌లో 16న బంగ్లాదేశ్‌తో
తలపడతాయి.