Asia Cup 2022: కేఎల్‌ రాహుల్‌ కోలుకున్నాడు.. కానీ..! అయ్యర్‌కే ఆ ఛాన్స్‌!

Asia Cup 2022: KL Rahul To Undergo Fitness Test At Bengaluru Reports - Sakshi

Asia Cup 2022 India Squad- KL Rahul: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని ఆసియా కప్‌-2022 టోర్నీ ఆడే భారత జట్టుకు ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు. అయితే, మెగా ఈవెంట్‌కు ముందు ఈ కర్ణాటక బ్యాటర్‌ ఫిట్‌నెస్‌ టెస్టు ఎదుర్కోవాల్సి ఉంది. ఒకవేళ ఈ పరీక్షలో రాహుల్‌ విఫలమైతే అభిమానులకు మరోసారి నిరాశ తప్పదు.

కాగా గాయం కారణంగా కేఎల్‌ రాహుల్‌ దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ హెర్నియాకు జర్మనీలో సర్జరీ చేయించుకున్న అతడు ఇంగ్లండ్‌ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోవిడ్‌ బారిన పడిన నేపథ్యంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు. 

కోలుకున్నాడు గానీ..
ఈ నేపథ్యంలో జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందిన రాహుల్‌ కోలుకున్నాడు. దీంతో సోమవారం ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. అయితే, నిబంధనల ప్రకారం రాహుల్‌.. వచ్చే వారంలో బీసీసీఐ వైద్య బృందం ముందు ఫిట్‌నెస్‌ టెస్టు ఎదుర్కోవాల్సి ఉంది. 

ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ..‘‘కేఎల్‌ రాహుల్‌ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అందుకే అతడిని జట్టుకు ఎంపిక చేశారు. అయితే, ప్రొటోకాల్‌ ప్రకారం బెంగళూరులో అతడికి ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహిస్తారు’’ అని పేర్కొన్నారు.

అయ్యర్‌కే ఆ ఛాన్స్‌!
రాహుల్‌ గనుక ఈ టెస్టులో విఫలమైతే స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022 కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌.. ఆ తర్వాత గాయం కారణంగా ఇంతవరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా సీజన్‌లో అతడు 15 ఇన్నింగ్స్‌ ఆడి 616 పరుగులు చేశాడు (అత్యధిక స్కోరు 103 నాటౌట్‌).

తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అదే విధంగా అరంగేట్ర సీజన్‌లోనే లక్నోను ప్లే ఆఫ్స్‌నకు చేర్చి కెప్టెన్‌గానూ సత్తా చాటాడు. ఇక ఆగష్టు 27 నుంచి ఆసియా కప్‌ టోర్నీ ఆరంభం కానుండగా.. ఆ మరుసటి రోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఈసారి తమ ప్రయాణం ఆరంభించనుంది.

ఆసియా కప్‌ 2022: బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), దినేశ్‌ కార్తిక్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌
చదవండి: Trent Boult: న్యూజిలాండ్‌ క్రికెట్‌కు భారీ షాక్‌.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకున్న స్టార్‌ బౌలర్‌
Sourav Ganguly: మహిళా క్రికెట్‌ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్‌.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top