T20 WC 2022- Virat Kohli: కోహ్లి విషయంలో వాళ్లదే తుది నిర్ణయం: బీసీసీఐ అధికారి

Arun Dhumal: As Far As Kohli Team Selection Concerned Leave It To Selectors - Sakshi

Virat Kohli: నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి విశ్రాంతినివ్వాలా లేదంటే జట్టుకు ఎంపిక చేయాలా అన్నది పూర్తిగా సెలక్టర్ల నిర్ణయమే అన్నాడు.

ఇక కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లి నిర్ణయించుకున్నపుడు, దానిని తాము గౌరవించామని పేర్కొన్నాడు. అంతేతప్ప ఎవరూ బలవంతంగా అతడిని తప్పించలేదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. అదే విధంగా భారత జట్టు ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోహ్లికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అరుణ్‌ ధుమాల్‌ పునురుద్ఘాటించాడు.

అయితే, ఇరువురి అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్న క్రమంలో ఇలాంటి వదంతులు వ్యాపించడం సహజమేనని చెప్పుకొచ్చాడు. కాగా గత కొన్ని రోజులుగా తన స్థాయికి తగ్గట్టు రాణించలేక కోహ్లి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌, జింబాబ్వే టూర్లకు అతడు దూరం కావడం గమనార్హం. విశ్రాంతి పేరిట కావాలనే కోహ్లిని తప్పిస్తున్నారని అభిమానులు అంటుండగా... తన కెరీర్‌కు ఏది సరైందో కోహ్లి ఆ నిర్ణయమే తీసుకుంటాడంటూ మరికొంత మంది అంటున్నారు.

అది వాళ్లు చూసుకుంటారు!
ఇక పలువురు క్రికెట్‌ దిగ్గజాలు సైతం కోహ్లికి ప్రస్తుతం బ్రేక్‌ అవసరమని, అప్పుడే అతడు తిరిగి పుంజుకుని మునుపటిలా రాణిస్తాడని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టు విమల్‌ కుమార్‌తో బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ ముచ్చటించాడు. టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో జట్టులో కోహ్లి స్థానం గురించి చర్చ జరుగుతుండగా అతడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

‘‘కోహ్లి ఎంపిక విషయంలో సెలక్టర్లదే తుది నిర్ణయం. అతడు జట్టులో ఉండాలా వద్దా అనేది వాళ్లే నిర్ణయిస్తారు. ఇక కెప్టెన్సీ గురించి చెప్పాలంటే.. తాను సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటానని కోహ్లి తనకు తానుగా చెప్పాడు. అది అతడి సొంత నిర్ణయం. మేము దానిని గౌరవించాం. భారత క్రికెట్‌కు అతడు ఎనలేని సేవ చేశాడు. ప్రతి ఒక్కరు అందుకు అతడిని గౌరవిస్తారు కూడా! ఏదేమైనా జట్టుకు అతడిని ఎంపిక చేయాలా వద్దా అనేది మాత్రం సెలక్టర్లు చూసుకుంటారు’’ అని పేర్కొన్నాడు.

ఇక కోహ్లి వర్సెస్‌ రోహిత్‌ అంటూ బయట జరుగుతున్న చర్చ గురించి తాము పట్టించుకోమన్న అరుణ్‌.. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడే స్వేచ్ఛ నెటిజన్లకు ఉందన్నాడు. అయినా, ఇలాంటి రూమర్లు కొత్తేమీ కాదని.. గతంలో సునిల్‌ గావస్కర్‌- కపిల్‌ దేవ్‌.. సచిన్‌ టెండుల్కర్‌- సౌరవ్‌ గంగూలీ విషయంలోనూ ఇలాగే మాట్లాడారని గుర్తుచేశాడు. 

చదవండి: CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్‌ జరీన్‌ చర్య.. ఏం జరిగింది?
Hardik Pandya May Vice Captain: రోహిత్‌ బాటలోనే కేఎల్‌ రాహుల్‌.. హార్దిక్‌కు ప్రమోషన్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top