చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌ సింగ్‌.. భారత తొలి బౌలర్‌గా.. | Arshdeep Singh Scripts History Becomes 1st Indian Bowler To Reach 100 T20I Wickets, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌ సింగ్‌.. భారత తొలి బౌలర్‌గా..

Sep 20 2025 9:56 AM | Updated on Sep 20 2025 11:10 AM

Arshdeep Singh Scripts History Becomes 1st Indian bowler to

టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో భాగంగా ఒమన్‌తో మ్యాచ్‌ సందర్భంగా అర్ష్‌దీప్‌ సింగ్‌ ఈ ఘనత సాధించాడు.

గత కొంతకాలంగా అర్ష్‌దీప్‌ సింగ్‌ బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని భావించినా.. ఐదు టెస్టుల్లో అతడికి ఒక్కదాంట్లోనే ఆడే అవకాశం రాలేదు. ఫిట్‌నెస్‌ సమస్యలు కూడా ఇందుకు కారణం.

స్పిన్నర్లకు పెద్దపీట
అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌ టోర్నీలో మాత్రం అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆడటం ఖాయమని విశ్లేషకులు భావించారు. కానీ ఈ ఈవెంట్‌ యూఏఈ వేదికగా జరుగుతోంది కాబట్టి.. మేనేజ్‌మెంట్‌ స్పిన్నర్లకు పెద్దపీట వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక్కడే తుదిజట్టులో దక్కించుకోగా.. అర్ష్‌ బెంచ్‌ మీదే ఉన్నాడు.

బుమ్రాకు విశ్రాంతి..  అర్ష్‌దీప్‌నకు అవకాశం
ఇక ఈ టోర్నీలో యూఏఈ, పాకిస్తాన్‌ జట్లను ఓడించి సూపర్‌-4కు అర్హత సాధించిన టీమిండియా.. లీగ్‌ దశలో ఆఖరిగా ఒమన్‌తో శుక్రవారం తలపడింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం అర్ష్‌దీప్‌ను ఆడించింది.

అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌.. ఒమన్‌ బ్యాటర్‌ వినాయక్‌ శుక్లా (1)ను అవుట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వందో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అర్ష్‌ బౌలింగ్‌లో వినాయక్‌ ఇచ్చిన క్యాచ్‌ను రింకూ సింగ్‌ పట్టడంతో ఇది సాధ్యమైంది.

వంద వికెట్ల క్లబ్‌లో
ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా అర్ష్‌దీప్‌ సింగ్‌ తన రికార్డును నిలబెట్టుకోవడంతో పాటు.. వంద వికెట్ల క్లబ్‌లో చేరిన భారత తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు.. తక్కువ మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానం సంపాదించాడు.

ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (173) మొదటి స్థానంలో ఉన్నాడు. రషీద్‌ 53 మ్యాచ్‌లలో ఈ ఫీట్‌ అందుకోగా.. 26 ఏళ్ల లెఫ్టార్మ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ 64 మ్యాచ్‌లలో వంద వికెట్లు సాధించాడు.

భారత్‌ వర్సెస్‌ ఒమన్‌ స్కోర్లు
👉వేదిక: షేక్‌ జాయేద్‌ స్టేడియం, అబుదాబి
👉టాస్‌: భారత్‌.. తొలుత బ్యాటింగ్‌
👉భారత్‌ స్కోరు: 188/8 (20)
👉ఒమన్‌ స్కోరు: 167/4 (20)
👉ఫలితం: ఒమన్‌పై 21 పరుగుల తేడాతో భారత్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సంజూ శాంసన్‌ (45 బంతుల్లో 56)

చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్‌-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్‌, టైమింగ్‌ వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement