
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ముందడుగు వేశారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో స్థానం మెరుగు పరుచుకున్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి అత్యుత్తమంగా వరుణ్ చక్రవర్తి (706 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా... రవి బిష్ణోయ్ (674 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, అర్ష్‌దీప్ సింగ్ సింగ్ (653 పాయింట్లు) పదో స్థానంలో ఉన్నారు.
అక్షర్ పటేల్ (636 పాయింట్లు) సైతం ఒక స్థానం మెరుగు పరుచుకొని 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ (829 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... తిలక్ వర్మ (804 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో ఉండగా... ఆసియా కప్ టోర్నీకి ఎంపిక కాని ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం కోల్పోయి 11వ ర్యాంక్‌లో నిలిచాడు.
ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 252 పాయింట్లతో ‘టాప్’లో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఎలాటి మార్పులు చోటుచేసుకోలేదు. బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్ (784 పాయింట్లు), రోహిత్ శర్మ (756 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లి (736 పాయింట్లు) నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు.
ఆర్చర్ అదుర్స్..
కాగా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సత్తాచాటాడు. ఏకంగా 16 స్ధానాలు జంప్ చేసి టాప్-3 ర్యాంక్‌కు ఆర్చర్ చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో ఆర్చర్ తన ర్యాంకింగ్స్‌లో గణనీయమైన పురోగతిని సాధించాడు. ఇదే సిరీస్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 680 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు'