
2 గోల్స్ చేసిన అర్జెంటీనా దిగ్గజం మెస్సీ
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సొంతగడ్డకు ఘనంగా వీడ్కోలు పలికాడు. కెరీర్‌కు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించనప్పటికీ అర్జెంటీనాలో మాత్రం ఇదే తన ఆఖరి పోరని ఇది వరకే స్పష్టం చేసిన మెస్సీ సొంత అభిమానులను 2 గోల్స్‌తో మురిపించాడు. దీంతో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–0తో వెనిజులాపై ఘనవిజయం సాధించింది.
తొలి అర్ధభాగంలో 39వ నిమిషంలో, ద్వితీయార్ధంలో 80వ నిమిషంలో మెస్సీ గోల్స్ కొట్టాడు. మరో గోల్‌ను మార్టినెజ్ (76వ నిమిషంలో) చేశాడు. మెస్సీ కుమారులు, కుటుంబసభ్యులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా మైదానానికి వచ్చి తిలకించారు. వచ్చే ఏడాది ప్రపంచకప్ కోసం దక్షిణ అమెరికా నుంచి తాజాగా ఉరుగ్వే, కొలంబియా, పరాగ్వే జట్లు మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాయి. అర్జెంటీనా మార్చిలోనే క్వాలిఫై అయ్యింది.