టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీతో చెలరేగాడు యశస్వి జైస్వాల్. వెస్టిండీస్‌తో టెస్టులో శతక్కొట్టి జట్టును గెలిపించాడు. ఆ పర్యటనలోనే అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు.
టెస్టుల్లో స్టార్ ఓపెనర్‌గా ఎదిగిన జైస్వాల్ (Yashasvi Jaiswal).. వన్డే అరంగేట్రానికి మాత్రం రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది సెలక్టర్లు అతడి నిరీక్షణకు తెరదించారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు.
అజేయ శతకం
ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన జైసూ.. 15 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అనంతరం సొంతగడ్డపై గతేడాది సౌతాఫ్రికాతో తన చివరి వన్డే ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అజేయ శతకం (116)తో ఆకట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ టీమిండియా సెలక్టర్లు, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్‌ను సెలక్టర్లు క్షమాపణ కోరాలని సూచించాడు. స్పోర్ట్స్‌స్టార్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..
సెలక్టర్ల ఆలోచన ఏమిటి?
‘‘యశస్వి జైస్వాల్ తన చివరి వన్డే ఇన్నింగ్స్‌లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతడు మళ్లీ వన్డే ఆడనే లేదు. సెలక్టర్లు 24 ఏళ్ల జైస్వాల్‌కు బదులు.. ఫిట్‌నెస్‌పై స్పష్టత లేని వెటరన్ బ్యాటర్ (రోహిత్ శర్మ) వైపు మొగ్గుచూపుతున్నారు.
అతడు ఇప్పుడు ఫామ్‌లో కూడా లేడు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో నాలాంటి వాళ్లకు కాస్త అర్థమయ్యేలా వివరించండి. అసలు వన్డే వరల్డ్‌కప్-2027 సన్నద్ధత విషయంలో సెలక్టర్ల ఆలోచన ఏమిటి?
ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలి
రోహిత్ శర్మ విషయంలో వాళ్లు రాజీ పడాల్సి వచ్చిందో.. లేదంటే ఇంకెందుకు అతడిని కొనసాగిస్తున్నారో నాకైతే తెలియదు. ఏదేమైనా వాళ్లు జైస్వాల్‌కు ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలి. కఠినమైన టెస్టు ఫార్మాట్లో ఈ యువ ఆటగాడు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.
24 ఏళ్ల వయసులోపే ఎన్నెన్నో శతకాలు బాదాడు. అతడి బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. విరాట్ కోహ్లి విషయం పక్కనపెడితే.. రోహిత్ శర్మను ఇంకెందుకు కొనసాగిస్తున్నారు?
రోహిత్ ఇంకెందుకు?
అజిత్ అగార్కర్ టీమిండియా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని నాకైతే అనిపించడం లేదు. ఇప్పటికీ రోహిత్ మాత్రమే వన్డేల్లో కీలక ఓపెనర్ అని భావిస్తున్నారా? అతడికి బదులు జైస్వాల్ లేదంటే సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వొచ్చు కదా!’’ అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో కెప్టెన్‌గా టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన రోహిత్ శర్మ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిపాడు. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో మేనేజ్‌మెంట్ అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి.. పగ్గాలు శుబ్‌మన్ గిల్‌కు అప్పగించింది. అతడి సారథ్యంలో భారత్ ఇప్పటికి ఒక్క సిరీస్ గెలవలేదు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడుతుంది. వన్డే సిరీస్‌లో ఫిట్‌నెస్‌కు లోబడి రోహిత్ శర్మ ఆడతాడని సెలక్టర్లు స్పష్టం చేశారు. ఈ జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కలేదు.


