
టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit Mishra) ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాతికేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. ఢిల్లీకి చెందిన అమిత్ మిశ్రా హర్యానా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో
ఇక 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అమిత్ మిశ్రా.. 2017లో ఇంగ్లండ్‌తో టీ20 సందర్భంగా తన అంతర్జాతీయ స్థాయిలో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. ఈ రైటార్మ్ లెగ్ స్పిన్నర్ 36 వన్డేలు, 22 టెస్టులు, పది టీ20 మ్యాచ్‌లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
వన్డేల్లో 64, టెస్టుల్లో 76, అంతర్జాతీయ టీ20లలో అమిత్ మిశ్రా 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 2008లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలర్.. గతేడాది చివరగా లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 162 మ్యాచ్‌లు ఆడి 174 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
క్రికెట్ నాకెంతో ఇచ్చింది
గాయాల బెడద, యువ ఆటగాళ్లకు అవకాశాలు రావాలనే ఉద్దేశంతో 42 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు అమిత్ మిశ్రా గురువారం ప్రకటించాడు. ఈ సందర్భంగా.. ‘‘నా జీవితంలో 25 సంవత్సరాలు క్రికెట్ ఆడాను. ఇంతకంటే నాకు గొప్ప విషయం మరొకటి ఉండదు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి, హర్యానా క్రికెట్ అసోసియేషన్, నా సహాయక సిబ్బంది, నా సహచర ఆటగాళ్లు.. నా కుటుంబ సభ్యులకు ఎంతో రుణపడి ఉన్నాను. అందరికంటే ముఖ్యంగా ఎల్లవేళలా నాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు.
నా ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా మార్చింది మీరే. క్రికెట్ నాకెంతో ఇచ్చింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. మైదానంలో నాకున్న జ్ఞాపకం పదిలమే. జీవితంలో నాకు లభించిన ఈ గొప్ప నిధిని కాపాడుకుంటాను’’ అని అమిత్ మిశ్రా ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.
ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా
కాగా 2008లో ఆస్ట్రేలియాతో మొహాలీ మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టిన అమిత్ మిశ్రా.. అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో చేరాడు.
ఇక 2013లో జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 18 వికెట్లు కూల్చిన ఈ స్పిన్నర్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జవగళ్ శ్రీనాథ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
ఇక బంగ్లాదేశ్ వేదికగా టీ20 ప్రపంచకప్-2014 టోర్నీలో పది వికెట్లు తీసిన అమిత్ మిశ్రా.. టీమిండియా రన్నరప్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా 2017 తర్వాత టీమిండియాలో చోటు కరువు కావడంతో మిశ్రా దేశీ క్రికెట్, ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమయ్యాడు.
ఐపీఎల్‌లో ఏకైక బౌలర్‌గా..
ఇక ఐపీఎల్‌లో అత్యధికంగా మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా అమిత్ మిశ్రా చిరస్మరణీయ రికార్డు సాధించాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్), 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అమిత్ మిశ్రా హ్యాట్రిక్ సాధించాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. వరల్డ్ నంబర్ వన్