చరిత్ర సృష్టించిన సికందర్‌ రజా.. వరల్డ్‌ నంబర్‌ వన్‌ | Sikandar Raza Creates History Becomes ODI No1 All Rounder First From | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సికందర్‌ రజా.. వరల్డ్‌ నంబర్‌ వన్‌

Sep 3 2025 6:40 PM | Updated on Sep 3 2025 8:17 PM

Sikandar Raza Creates History Becomes ODI No1 All Rounder First From

సికందర్‌ రజా (PC: ICC)

జింబాబ్వే స్టార్‌ క్రికెటర్‌ సికందర్‌ రజా (Sikandar Raza) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌ (ODI No.1 All Rounder)గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో రజా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

అద్భుత ప్రదర్శన
తద్వారా జింబాబ్వే నుంచి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం దక్కించుకున్న తొలి ఆల్‌రౌండర్‌గా సికందర్‌ రజా రికార్డు సాధించాడు. శ్రీలంకతో తాజా వన్డే సిరీస్‌ సందర్భంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ రజా ఈ ఘనత సాధించాడు. కాగా పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జన్మించిన సికందర్‌ రజా చాలా ఏళ్ల క్రితమే జింబాబ్వేకు వలస వెళ్లాడు.

అక్కడే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన సికందర్‌ రజా.. జింబాబ్వే తరఫున మేటి బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరుగాంచాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అతడు జింబాబ్వే జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్‌ అయిన రజా.. రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా!

సెంచరీ మిస్‌ అయినా..
ఇక 39 ఏళ్ల సికందర్‌ రజా ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. రెండు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు లంక జింబాబ్వేకి వెళ్లింది. ఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్‌ జరుగగా.. రెండింట గెలిచిన శ్రీలంక.. జింబాబ్వేను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

అయితే, వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ సికందర్‌ రజా మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 87 బంతుల్లో 92 పరుగులు చేయడంతో పాటు.. ఓ వికెట్‌ కూడా పడగొట్టాడు. ఇక రెండో వన్డేలోనూ అర్ధ శతకం (55 బంతుల్లో 59 నాటౌట్‌) సాధించాడు రజా. ఈ క్రమంలో ఐసీసీ మెన్స్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకువచ్చాడు.

ఐసీసీ మెన్స్‌ వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో ఉన్నది వీరే
🏏సికందర్‌ రజా (జింబాబ్వే)- 302 రేటింగ్‌ పాయింట్లు
🏏అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (అఫ్గనిస్తాన్‌)- 296 రేటింగ్‌ పాయింట్లు
🏏మహ్మద్‌ నబీ(అఫ్గనిస్తాన్‌)- 292 రేటింగ్‌ పాయింట్లు
🏏మెహిదీ హసన్‌ మిరాజ్‌ (బంగ్లాదేశ్‌)- 249 రేటింగ్‌ పాయింట్లు
🏏మైకేల్‌ బ్రాస్‌వెల్‌ (న్యూజిలాండ్‌)- 246 రేటింగ్‌ పాయింట్లు.

నంబర్‌ వన్‌ గిల్‌, హార్దిక్‌
👉ఇదిలా ఉంటే.. మెన్స్‌ టీ20 ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు.. వన్డేల్లో శుబ్‌మన్‌ గిల్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా టాప్‌ ర్యాంకులో కొనసాగుతుండగా.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కేశవ్‌ మహరాజ్‌ అగ్రపీఠంపై ఉన్నాడు. ఇక సికందర్‌ రజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ తొమ్మిది స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకు సాధించడం గమనార్హం.

చదవండి: అతడికి అనుమతి ఎందుకు?.. అసలు బీసీసీఐ ఏం చేస్తోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement