‘నేను క్లారిటీగా ఉన్నా.. మీ టైం వృథా చేసుకోవద్దు’ | Ajinkya Rahane Major Update Retirement after KKR’s IPL 2026 exit | Sakshi
Sakshi News home page

‘నేను క్లారిటీగా ఉన్నా.. మీ టైం వృథా చేసుకోవద్దు’

May 25 2026 1:53 PM | Updated on May 25 2026 4:15 PM

Ajinkya Rahane Major Update Retirement after KKR’s IPL 2026 exit

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌ను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఓట‌మితో ముగించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 40 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాల‌య్యింది. అయితే అంత‌క‌ముందే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ముంబైపై గెలిచి ప్లేఆఫ్స్‌కు చేర‌డంతో ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్ నామామాత్రంగా మారిపోయింది. అయితే విజ‌యంతో సీజ‌న్‌ను ముగిద్దామ‌నుకున్న కేకేఆర్‌కు భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో భంగ‌పాటు ఎదురైంది. 

ఈ సీజ‌న్‌లో కేకేఆర్ ఆట‌తీరుపై, ర‌హానే నాయ‌క‌త్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌, త‌న కెప్టెన్సీపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ర‌హానే ఘాటుగా స‌మాధాన‌మిచ్చాడు. ర‌హానే మాట్లాడుతూ.. ‘జ‌ట్టు వ‌రుస ఓట‌ములతో కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదా వెనక్కి తగ్గడం నా డిక్షనరీలోనే లేదు. నేను ఎప్పుడూ సవాళ్లను చూసి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. 

ఈ కఠిన పరిస్థితుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఆలోచన నా మనసులోకి ఒక్కసారి కూడా రాలేదు. ఒక నాయకుడిగా జట్టును ముందుకు నడపడమే తన బాధ్యత అని, గెలుపోటములు ఆటలో సహజం. నేనైతే కేకేఆర్‌తోనే కొనసాగాలనుకుంటున్నా. నాకు ఆడాలనిపించినకాలం క్రికెట్ ఆడుతాను. రిటైర్మెంట్ ఆలోచన ఇప్పుడేం లేదు. 

ఐపీఎల్ ముగియడంతో కొంతకాలం కుటుంబంతో గడుపుతాను. ఆ తర్వాత ముంబైలో లోకల్ లీగ్‌లో పాల్గొంటాను. క్రికెట్ ఆడడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని రహానే చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ ప్రదర్శనపై కూడా రహానే స్పందించాడు. 

‘సీజన్‌ ఆరంభంలో వరుస పరాజయాలు మా జట్టును కుంగదీశాయి. కానీ రెండో అంచె పోటీల్లో గోడకు కొట్టిన బంతిలా మేం తిరిగి ఫుంజుకున్నాం. వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి కూడా వచ్చాం. కొన్ని మ్యాచ్‌ల్లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయాం. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచి ఉండుంటే ఇవాళ ప్లేఆఫ్స్‌లో ఉండేవాళ్లం.  రాబోయే సీజన్‌లో తప్పులను సరిదిద్దుకుని బలంగా పునరాగమనం చేస్తాం.’ అని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ సీజ‌న్‌లో కేకేఆర్ ప్ర‌యాణం అంచ‌నాల‌కు భిన్నంగా సాగింది. ఒక మ్యాచ్ రద్దు సహా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన కేకేఆర్ తొలి హాఫ్‌లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. అయితే రెండో సగంలో మాత్రం వరుసగా నాలుగు విజయాలు సాధించి ఔరా అనిపించింది. మధ్యలో ఆర్సీబీ చేతిలో ఓడినా మళ్లీ రెండు విజయాలు సాధించిన కేకేఆర్ ఒక్కసారిగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.

కానీ పంజాబ్‌, రాజస్తాన్‌లతో పోలిస్తే నెట్ రన్‌రేట్ చాలా తక్కువగా ఉండడంతో పోటీలో ఉన్నప్పటికీ ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సి వచ్చింది. రహానే కెప్టెన్సీపై విమర్శలు వచ్చినప్పటికీ, అతడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా జట్టును సమర్థంగా నడిపించాడు. ఐపీఎల్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ వచ్చే సీజన్‌లో తప్పులను సరిదిద్దుకొని సత్తా చాటుతుందని ఆశిద్దాం.

చదవండి: హెడ్ భార్య‌కు అవమానం.. వికృత చేష్ట‌లు ఆపండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement