
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ టీ20 జట్టులో చోటు కోల్పోయిన బాబర్.. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీకి కూడా ఎంపిక కాలేకపోయాడు.
అయితే, తాజాగా బాబర్ ఆజంకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో.. లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో జరిగే శిక్షణా శిబిరంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ సన్నాహక శిబిరం కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం సెప్టెంబరు 8నే ఎన్‌సీఏలో రిపోర్టు చేయాల్సిందిగా పీసీబీ ఆటగాళ్లను ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా పదకొండు మంది ఇందులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే, వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో పాటు పేసర్ నసీం షా మాత్రం ఈ శిక్షణా శిబిరానికి దూరం కానున్నారు. వారిద్దరు ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు.
అయితే, బాబర్‌తో పాటు అబ్దుల్లా షఫీక్, అలీ రెజా, అజాన్ అవైస్, సాజిద్ ఖాన్, రొహైల్ నజీర్ కూడా ఈ సన్నాహక శిబిరానికి హాజరుకానున్నట్లు సమాచారం.
ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్లో పాక్
బ్యాటింగ్‌లో ఫఖర్ జమన్ (44 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్పిన్ బౌలింగ్‌తో అబ్రార్ అహ్మద్ (4–0–9–4) పాకిస్తాన్‌ను గెలిపించి ముక్కోణపు సిరీస్ ఫైనల్‌కు చేర్చారు. టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌లో భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై గెలుపొందింది.
మొదట పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్హాన్ (16), అయూబ్ (11) విఫలమైనా... ఫఖర్ ధాటిగా ఆడాడు. ఆఖర్లో మొహమ్మద్ నవాజ్ (27 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో దిగిన యూఏఈ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేయగలిగింది.
ఓపెనర్ అలీషాన్ (51 బంతుల్లో 68; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పరుగులే చేయలేకపోవడంతో జట్టుకు ప్రతికూలంగా మారింది. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ యూఏఈ బ్యాటర్లకు స్పిన్ ఉచ్చు బిగించాడు. రేపు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది.
చదవండి: సక్సెస్‌ఫుల్ కెప్టెన్.. ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తాడు: ఇర్ఫాన్ పఠాన్‌కు చురకలు