అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచ‌కోత‌! | Abhishek Sharma and Ishan Kishan sizzle with incredible knocks in SRH practice game before IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచ‌కోత‌!

Mar 22 2026 8:47 AM | Updated on Mar 22 2026 11:15 AM

Abhishek Sharma and Ishan Kishan sizzle with incredible knocks in SRH practice game before IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాళ్లు తమ విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో అన్ని జ‌ట్ల‌ను భ‌య‌పెడుతున్నారు. శనివారం జ‌రిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ స్టార్ బ్యాట‌ర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిష‌న్, హెన్రిచ్ క్లాసెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయారు.

స‌న్‌రైజ‌ర్స్ రెండు జ‌ట్ల‌గా విడిపోయి ప్రాక్టీస్ చేసింది. తొలుత స‌న్‌రైజ‌ర్స్‌-ఎ జ‌ట్టు త‌ర‌పున ఆడిన అభిషేక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. ఉప్ప‌ల్ మైదానంలో బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 42 బంతుల్లోనే 94 పరుగులు సాధించి అన్ని జ‌ట్ల‌కు హెచ్చరిక జారీ చేశాడు.

అత‌డి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. అత‌డితో హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), సలిల్ అరోరా (16 బంతుల్లో 47)రాణించారు. ఫ‌లితంగా తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్‌-ఎ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి  253 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ మాత్రం కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు. 

సన్‌రైజర్స్-బి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్  ఐదు వికెట్లతో సత్తా చాటగా.. నితీష్ రెడ్డి మూడు వికెట్లు తీసాడు. అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ బి టీమ్ త‌ర‌పున కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈసారి అభిషేక్ శ‌ర్మ‌(4) నిరాశ‌ప‌రిస్తే.. కిషాన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.

ఇషాన్ 25 బంతుల్లో 72 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. అయితే  253 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని మాత్రం బి టీమ్ చేరుకోలేక‌పోయింది.  ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి.
చదవండి: పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్‌


 

 

Advertisement
 
Advertisement
Advertisement