పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్‌ | Sunil Gavaskars Sharp Response To Criticism For Attending Pakistani Show | Sakshi
Sakshi News home page

పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్‌

Mar 22 2026 8:09 AM | Updated on Mar 22 2026 1:00 PM

Sunil Gavaskars Sharp Response To Criticism For Attending Pakistani Show

ఆసియాకప్‌-2025 సందర్భంగా ఓ పాకిస్తానీ టీవీ క్రికెట్ షో అతిథిగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఐసీసీ, ఏసీసీ కామెంటరీ ప్యానెల్‌లో గవాస్కర్ ఉండడంతో ఆ క్రికెట్ షోకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే అప్పటిలో ఈ విషయాన్ని ఎవరూ తప్పు బట్టలేదు.

కానీ ఇటీవల ది హాండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌గ్రూప్ యాజమాన్యంకు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడాన్ని గవాస్కర్ విమర్శించాడు. పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారత సైనికులు, పౌరుల మరణానికి దోహదపడటమేనని వ్యాఖ్యానించాడు.

ఈ క్రమం‍లో పాకిస్తాన్ టీవీ ఛానల్ డిబేట్‌లో మీరు పాల్గొన్నారని గవాస్కర్‌ను కొంత మంది ప్రశ్నించారు. తాజగా తనపై వచ్చిన విమర్శలపై గవాస్కర్ స్పందించారు. కామెంటరీ ప్యానల్‌లో ఉన్నందున మాత్రమే ఆ క్రికెట్ షోలో పాల్గొనాల్సి వచ్చింది అని లిటిల్ మాస్టర్ అన్నారు.

"నేను ఐసీసీ, ఏసీసీ వ్యాఖ్య‌త‌ల ప్యానెల్‌లో ఉన్నాను. ఈ టోర్నీలో పాల్గోన్న అన్ని దేశాల‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆదాయం వెళ్తుంది. అంతే త‌ప్ప ఏ భార‌తీయ సంస్థ నుంచి కూడా పాక్‌కు ఆదాయం వెళ్ల‌డం లేదు. అదేవిధంగా నేను కూడా ఆ దేశానికి ఎలాంటి డబ్బులు చెల్లించడం లేదు.

కాబ‌ట్టి నేను పాకిస్తాన్‌కు స‌హ‌క‌రిస్తున్నాను అన‌డంలో అర్ధం లేదు. కేవలం భారత్ నుంచి పాకిస్తాన్‌కు నగదు సాయం చేయడం ఆపాలని మాత్రమే కోరుకుంటున్నాను. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి ఒక్క రూపాయి కూడా భారత్‌కు రాలేదు" అని ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నారు. కాగా హాండ్రెడ్ లీగ్ వేలంలో అబ్రార్‌ను రూ. 2.35 కోట్లు భారీ ధ‌ర వెచ్చించి మ‌రి కొనుగోలు చేసింది. 
చదవండి: ‘ఐసీసీ మా యాజమాని కాదు’
 

Advertisement
 
Advertisement
Advertisement