
నిన్న జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడి జీతం సెకెన్ల వ్యవధిలో 1050 శాతం పెరిగింది. ఈ హఠాత్ పరాణామం చూసి నిర్వహకులు సహా వేలంలో పాల్గొన్న వారంతా నివ్వెరపోయారు.
పూర్తి వివరాల్లో వెళితే.. WTC 2023-25 టైటిల్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు సభ్యుడు కైల్ వెర్రిన్ నిన్న జరిగిన వేలంలో R200K (₹10.06 లక్షలు) బేస్ ధరతో పాల్గొన్నాడు. వెర్రిన్‌ను పార్ల్ రాయల్స్ ఇదే ధరకు దక్కించుకుని సంతృప్తి చెందింది. అయితే ఈలోపే వెర్రిన్‌ను దక్కించుకునేందుకు ప్రిటోరియా క్యాపిటల్స్ RTM (Right to Match) కార్డ్‌తో ముందుకొచ్చింది.
దీంతో అలర్ట్ అయిన రాయల్స్ వెర్రిన్ ధరకు ఒక్కసారిగా 1050 శాతం పెంచి R2.3 మిలియన్లకు (₹1.15 కోట్లు) తీసుకెళ్లింది. ఇది చూసి క్యాపిటల్స్ సహా వేలం నిర్వహకులంతా నివ్వెరపోయారు. రాయల్స్ ఒక్కసారిగా వెర్రిన్ ధరను ఎందుకంత పెంచిందో ఎవ్వరికీ అర్దం కాలేదు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన వెర్రిన్‌కు రాయల్స్ అంత ప్రాధాన్యత ఇవ్వడం చూసి జనాలు అవాక్కయ్యారు.
వాస్తవానికి వెర్రిన్‌ను పొట్టి ఫార్మాట్‌లో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డేమీ లేదు. అతనో సాధారణ వికెట్‌కీపర్ బ్యాటర్ మాత్రమే. అడపాదడపా మెరుపులు మెరిపించగలడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. రాయల్స్ ఈ స్థాయి భారీ మొత్తం వెచ్చించాలనుకుంటే ఇంతకంటే మెరుగైన ప్రొఫైల్ ఉన్న ఆటగాడి కోసం పోటీపడి ఉండవచ్చు.
కానీ వెర్రిన్‌కు ఇంత భారీ బిడ్ ఎందుకు వేసిందో మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండిపోయింది. ఫైనల్‌గా రాయల్స్ వెర్రిన్‌ను దక్కించుకోగలిగింది కానీ, అనవసర ఖర్చును మీదేసుకుంది. ఒకవేళ క్యాపిటల్స్ కానీ మరే ఇతర ఫ్రాంచైజీ కానీ వెర్రిన్ కోసం పోటీపడినా అతని ధర భారత కరెన్సీలో ₹30 లక్షలు మించేది కాదు.
అలాంటిది రాయల్స్ ఏకంగా ₹1.15 కోట్లు పెట్టి చేతులు కాల్చుకుంది. ఏది ఏమైనా వెర్రిన్ మాత్రం జాక్‌పాట్ కొట్టాడు. ₹10 లక్షలే ఎక్కువనుకుంటే.. సెకెన్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అతని కెరీర్‌లో ఇదే భారీ వేలం మొత్తం. వెర్రిన్ గత రెండు సీజన్లలో క్యాపిటల్స్‌కు ఆడాడు. ఇందుకే ఆ ఫ్రాంచైజీ వెర్రిన్ కోసం RTM వాడింది.
Paarl Royals Squad 2025–26: డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), కైల్ వెర్రిన్, సికందర్ రజా, ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుడకేష్ మోటీ, బ్జోర్న్ ఫోర్టుయిన్, డాన్ లారెన్స్, హార్డస్ విల్జోయెన్, డెలానో పోట్గిటర్, రూబిన్ హెర్మన్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, కీగన్ లయన్-కాషెట్, ఎషాన్ మాలింగ, ఆసా ట్రైబ్, విశెన్ హలంబేజ్, జాకబ్ బాస్సన్, ఎన్‌కోబాని మొకోయెనా, ఎన్‌కాబయోమ్జీ పీటర్